
తన మాటలు , చేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. ఆయనను ఎవరు కదిపినా, లేదా ఏదైనా వేదికలెక్కినా వెంటనే వచ్చే డైలాగ్.. ‘‘కష్టపడ్డా, పాలు , పూలు అమ్మినా, కాలేజీల్ పెట్టినా’’ అంటారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ డైలాగ్స్ పాపులర్. ఇదే ఆయనను మాస్ జనాలకు బాగా దగ్గర చేసింది. ఇక అసెంబ్లీలో మల్లన్న మైక్ అందుకున్నారంటే ఎవరైనా నవ్వు ఆపుకోవడం కష్టమే. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి మంత్రి మల్లారెడ్డి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తాను అమ్మవారిని కోరుకున్న కోరికలన్నీ తీరాయని మల్లారెడ్డి. ఈ ఏడాది ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఒకటి కోరుకున్నానని.. అది కూడా తీరుతుందని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ మోడల్ అభివృద్ధిని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నాయని మల్లారెడ్డి చెప్పారు. అది నెరవేరాలంటే కేసీఆర్, బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విజయవంతం కావాల్సిన అవసరం వుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్, బీజేపీల పరిపాలన చూశామని.. కానీ బీఆర్ఎస్ మాదిరిగా ఎవరూ అభివృద్ధి చేయలేకపోయారని మల్లారెడ్డి పేర్కొన్నారు.
ALso Read: గొర్రెల కాపరి అవతారమెత్తిన మల్లన్న
ఇదిలావుండగా.. కొద్దిరోజుల క్రితం మల్లారెడ్డి గొర్రెల కాపరి అవతారం ఎత్తాడు.మేడ్చల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 15 మందికి గొర్రె పిల్లలను పంపిణీ చేశారు. ఈ తంతు ముగిసిన అనంతరం మల్లన్న గొర్రెల కాపరి వేషధారణలో యాదవుల వద్దకు వెళ్లి వారితో ముచ్చటించారు. ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా వుంటుందని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. అందరూ బాగుండాలనేది కేసీఆర్ కోరుకుంటున్నారని మంత్రి చెప్పారు.