కేంద్రానికి కేటీఆర్ ఘాటు లేఖ.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదన్న కేంద్రంపై సీరియస్

By Mahesh KFirst Published Mar 28, 2023, 8:01 PM IST
Highlights

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ ఘాటుగా లేఖ రాశారు. చిన్న చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులు కేటాయించిన కేంద్రం.. అన్ని అర్హతలున్న హైదరాబాద్‌పై ఎందుకు పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలు, డీపీఆర్‌లను పలుమార్లు కేంద్రానికి సమర్పించాని వివరించారు.
 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కే తారకరామా రావు ఘాటు లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై హైదరాబాద్ నగరంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆగ్రహించారు. హైదరాబాద్ కన్నా అర్హతలు లేని పట్టణాలు, నగరాలకు మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం అన్ని అర్హతలున్న హైదరాబాద్ పై ఎందుకు పక్షపాత ధోరణి అవలంబిస్తున్నదని ప్రశ్నించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి ఆయన లేఖ రాశారు.

గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతోపాటు అతి తక్కువ జనాభా గల లక్నో, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, ప్రయాగ్ రాజ్, మీరట్ వంటి యూపీలోని చిన్న చిన్న పట్టణాలకు మెట్రో ప్రాజెక్టులను కేంద్రం కేటాయించిందని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభా రద్దీ తక్కువగా ఉన్న ఈ పట్టణాలకూ మెట్రోకు అర్హతలున్నాయని పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం.. అంతకంటే ఎక్కువ జనసమ్మర్ధం ఉన్న హైదరాబాద్‌కు అర్హత లేదని చెప్పడం విడ్డూరంగా ఉన్నదని తెలిపారు. చిన్న పట్టణాలే అర్హత సాధించినప్పుడు హైదరాబాద్‌పై ఎందుకు శీతకన్ను అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇది కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంపై ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై కేంద్రం చూపుతున్న పక్షపాతమే అని, కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని తీవ్రంగా విమర్శించారు.

Also Read: ఫ్లై ఓవర్ల కింద క్రీడా వేదికలు.. ఈ ఐడియా బాగుంది.. హైదరాబాద్‌లోనూ చేద్దాం: కేటీఆర్

మెట్రో రైల్ రెండో దశకు కావాల్సిన సమాచారాన్ని పలుమార్లు అందించామని, డీటెయిల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ (డీపీఆర్)ను కూడా అందించామని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పీహెచ్‌డీటీ గణాంకాలు, ఇతర అర్హతలు, సానుకూలతలను కేంద్రం దృష్టికి చాలా సార్లు తీసుకువచ్చామని పేర్కొన్నారు. గతంలో అందించిన నివేదికల సమాచారాన్నీ లేఖకు జతచేశారు. తమకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్న కేంద్రానికి మరోసారి సమగ్ర సమాచారాన్ని, ఇతర పత్రాలు, రిపోర్టులను పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురిని వ్యక్తిగతంగా కలిసి ఈ ప్రాజెక్టు రెండో దశ ప్రాధాన్యతను వివరించడానికి చాలా సార్లు ప్రయత్నించానని, కానీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ కార్యాలయం నుంచి స్పందన రాలేదని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నేపథ్యాన్ని ఆలోచించి నగర మౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో హర్దిప్ సింగ్ పురి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని ఆశించామని తెలిపారు. ఇప్పటికైనా సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఏ సందేహాలున్నా నివృత్థి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు.

click me!