కల్లు గీత కార్మికులపై కేటీఆర్ వరాల జల్లు.. మోపెడ్‌లు ఇస్తామన్న మంత్రి

By Siva Kodati  |  First Published Oct 23, 2022, 5:57 PM IST

కల్లు గీత కార్మికులపై మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కల్లు గీత కార్మికులకు చెట్ల పన్నును రద్దు చేశామని మంత్రి తెలిపారు. 


గీత వృత్తిదారులకు మోపెడ్‌లు అందిస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఆదివారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు ధ్వంసమయ్యాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కులవృత్తులను బలోపేతం చేస్తూ వస్తున్నామని... ప్రతి కులవృత్తికి ప్రభుత్వం అండగా నిలిచిందని కేటీఆర్ గుర్తుచేశారు. వైన్ షాపుల్లో కార్మికులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించిందని.. కల్లు గీత కార్మికులకు చెట్ల పన్నును రద్దు చేశామని మంత్రి తెలిపారు. 

అలాగే గీత కార్మికులకు నెలకు రూ.2016 పెన్షన్ ఇస్తున్నామని.. ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలతో లక్ష చొప్పున సాయం చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కటకట వుండేదని.. కేసీఆర్ పాలనలో విద్యుత్ సమస్య పరిష్కారమైందని ఆయన చెప్పారు. 975 గురుకుల పాఠశాలలు పెట్టి ఆడబిడ్డలను ఉన్నత విద్యావంతులను చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని... ప్రతి గ్రామంలో నర్సరీ, ట్రాక్టర్, నీళ్లు, విద్యుత్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

Latest Videos

ALso Read:నల్గొండలో ఒక్కరి ఖాతాలోనే డబ్బులు... పేదల సంగతేంటీ మోడీజీ : రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు

ఇకపోతే... మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కులాల సంఘాల మద్ధతు కూడగట్టడంతో పాటు కార్మిక వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనిలో భాగంగా శనివారం మన్నెగూడలో లారీ యజమానులు, డ్రైవర్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది టీఆర్ఎస్ పార్టీ. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై... ప్రసంగించారు. అందరి అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 8 ఏళ్లలో ఏం సాధించామో ఆలోచించాలని... ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని కేటీఆర్ తెలిపారు. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

విద్యుత్, నీటి కొరత సమస్యల్ని ... నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించుకున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్‌కు సరకు లేదు.. పేదల సమస్యలపై సోయి లేదని కేటీఆర్ సెటైర్లు వేశారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్‌లు, ఇతర పన్నుల ద్వారా రూ.30 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాలో ఒక్కరి ఖాతాలోనే జిల్లా వాసులందరి డబ్బులు పడ్డట్టుగా వున్నాయంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 
 

click me!