మునుగోడులో ధర్మ యుద్ధం జరుగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ప్రజలకు నిరంతరం అండగా ఉండే నేతలను ఎన్నుకోవాలని ఆయన ప్రజలను కోరారు.కమ్యూనిస్టులు కేసీఆర్ కు అమ్ముడుపోయారని ఆయన విమర్శించారు.
హైదరాబాద్: మునుగోడులో ధర్మ యుద్ధం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చెప్పారు. మునుగోడులో బరిలో ఉన్న అభ్యర్థులను బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు. మునుగోడులో ఆపదలో ఆదుకుంటూ ప్రజలు మంచి చేస్తున్న మొనగాడు గెలవాలా? గడీల పాలనలో కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేటోడు గెలవాలా? ఆలోచించి ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.
టీఆర్ఎస్ నిధులతోనే కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.. కమ్యూనిస్టులు ఎర్ర గులాబీలుగా మారిపోయారని బండి సంజయ్ సెటైర్లు వేశారు. సీపీఐ జాతీయ మహా సభలకు టీఆర్ఎస్ నిధులు సమకూర్చినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. కేటీఆర్ ను పిరికిపందగా ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ అక్రమాలపై మాట్లాడుతుంటే కోర్టు నుండి ఉత్తర్వులు తెచ్చుకున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ లోని నాగోల్ లో నిర్వహించిన మునుగోడు ప్రజలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం లో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మనోహర్ రెడ్డికి టిక్కెట్ రాకపోయినా ఏమాత్రం అసంతృప్తి లేకుండా పార్టీ గెలుపే తన గెలుపుగా భావించి కష్టపడి పనిచేస్తున్నారు. పాదయాత్ర ద్వారా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కష్టపడుతున్నారు.. రాష్ట్రంలో ఏ సర్వే చూసినా బీజేపీ గెలుపు ఖాయమని నివేదికలు చెబుతున్నట్టుగా చెప్పారు.
మునుగోడులో ధర్మయుద్దం జరుగుతోందన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులను బేరీజు వేసుకోవాలని ఆయన కోరారు.మునుగోడులో మొనగాడు గెలవాలా? గడీల పాలన మోచేతి నీళ్లు తాగేటోడు గెలవాలా? ఆలోచించుకోవాలన్నారు.మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి ఎక్కడా పోటీ చేయడం లేదన్నారు. ప్రచారానికి వెళితే మహిళలు తలుపులు మూసుకునే పరిస్థితి నెలకొందన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ భవిష్యత్తుకు చెందిందని చెప్పారు.పొరపాటున ఫలితాలు తారుమారైతే ప్రజలు ఆశీర్వదించారని కేసీఆర్ భావించే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే జరిగితే కేసీఆర్ అహంకారం మరింత ఎక్కువై ఫాంహౌజ్ కే పరిమితమయ్యే ప్రమాదం ఉందన్నారు.
కాంగ్రెస్ కు టీఆర్ఎస్ ఆర్దిక సాయం చేస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ ఇచ్చే నిధులతోనే కాంగ్రెస్ మునుగోడు ఎన్నికల ప్రచారం చేస్తోందన్నారు. కేసీఆర్ ఫాంహౌజ్ ను వీడి గల్లీలోకి వచ్చారంటే బీజేపీ చేస్తున్న పోరాటాలే కారణమని చెప్పారు. తినడానికి తిండి లేక. తిరగడానికి కారు కూడా లేని కేసీఆర్ ఈరోజు 100 కోట్లతో విమానం ఎట్లా కొంటున్నారని ప్రశ్నించారు.వేల కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించారు? విదేశాల్లో పెట్టుబడులు ఎట్లా పెడుతున్నారో ఆలోచించాలన్నారు. మునుగోడును ఎందుకు అభివృద్ది చేయడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
గొర్రెల పథకం డబ్బులు ఆపాలని తాను లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై తడిబట్టలతో కలిసి దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పారు. దమ్ముంటే నువ్వు సిద్ధమా? అని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. తన సవాల్ ను సీఎం స్వీకరించాలని కోరారు.
తెలంగాణలో చెల్లని రూపాయే కేసీఆర్ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పనైపోయిందన్నారు.. ఇక బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాల్లో పట్టించుకునేదెవ్వరు? టీఆర్ఎస్ గెలవాలని ఆ పార్టీ నేతలకే లేదన్నారు.
డబ్బు, బంగారం, మందు, మాంసాన్ని టీఆర్ఎస్ విచ్చలవిడిగా పంచుతోందని ఆయన విమర్శించారు.. మంత్రుల, అధికార పార్టీ ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు ఎందుకు తనిఖీ చేయరని బండి సంజయ ప్రశ్నించారు. రెండు, మూడు కంపెనీలు సీఎం కేసీఆర్ కు కొమ్ముకాస్తున్నాయని ఆయన ఆరోపించారు.. సొంత ఫ్యాక్టరీల్లో డబ్బు డంప్ చేస్తున్నారన్నారు. .
అడ్డగోలుగా మంత్రులు సంపాదించారన్నారు. ఈ నిధులను కేసీఆర్ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.మంత్రుల, ఎమ్మెల్యేల చిట్టా రెడీగా ఉందన్నారు.. 2014 ఎన్నికల అఫిడవిట్ లో మీరు పొందుపర్చిన ఆస్తులెన్ని? ఇప్పుడు మీరు సంపాదించిన ఆస్తులెన్ని అనే వివరాలన్నీ బయటపెడతామన్నారు.
భారత్ జోడో యాత్రను . కాంగ్రెస్-టీఆర్ఎస్ జోడీ యాత్రగా ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఏ నాయకుడూ చెప్పలేదన్నారు.. 370 ఆర్టికల్ ను రద్దు చేసి కాశ్మీర్ ను భారత్ అంతర్భాగమని చాటి చెప్పిన ఘనత బీజేపీదేనని చెప్పారు.దేశానికి కాంగ్రెస్ సాధించిదేమిటో చెప్పాలన్నారు. సీపీఐ జాతీయ సభలకు నిధులిచ్చింది టీఆర్ఎస్సేనని చెప్పారు. ఖమ్మంలో టీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన కేసులో ఏ1గా ఉన్న సీపీఎం నాయకుడిని ఏ9గా మార్చినందుకు టీఆర్ఎస్ వద్ద సీపీఎం నాయకత్వం మోకరిల్లిందని ఆయన విమర్శించారు.
ఉద్యోగాలు భర్తీ చేయకుండా 8 ఏళ్లుగా నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ సిగ్గు లేకుండా ఓట్లడుగుతున్నాడన్నారు. గ్రూప్-1 పరీక్షలు కూడా నిర్వహించడం చేతకాని అసమర్ధుడు కేసీఆర్ అని బండి సంజయ్ మండిపడ్డారు.దమ్ముంటే బిశ్వాల్ కమిటీ నివేదికలో పేర్కొన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
alsoread:మునుగోడులో కాంగ్రెస్ , బీజేపీ వర్గాల ఘర్షణ:పాల్వాయి స్రవంతి కాన్వాయిపై దాడి
ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, భాగ్యనగర్ అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, రంగారెడ్డి జల్లా రూరల్ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.