
పది వేల రూపాయల వరద సాయం ఆపిన వాళ్లు రూ.25 వేలు ఇస్తారంటే నమ్ముతారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఈ సాయంత్రం ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఐఎల్ చౌరస్తాలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... డిసెంబర్ నుంచి 20 వేల లీటర్ల బిల్లు మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్ వరదలు, వర్షాలతో అల్లాడుతున్నప్పుడు కేంద్రమంత్రులు వచ్చి వుంటే బాగుండేదని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read:పీవీ, ఎన్టీఆర్‌లపై వ్యాఖ్యలు: అక్బరుద్దీన్‌కు కేటీఆర్ కౌంటర్
కేంద్ర మంత్రులు ఉత్త చేతులతో కాకుండా వరద సాయం 1,350 కోట్లు తీసుకువస్తారని ఆకాంక్షిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. ఒక పిచ్చోడు ఏమో ఎన్టీఆర్, పీవీ సమాధులు కూలగొడతామంటాడు.. మరొకరేమో రాంగ్ రూట్లో బండ్లు నడపండి చలాన్లు మేం కడతామంటాడు అంటూ పరోక్షంగా బండి సంజయ్, అక్బరుద్దీన్‌లపై మంత్రి విమర్శలు కురిపించారు.
పనిచేసి చూపిస్తాం ఓటేయండని ఐదేళ్ల కిందట వచ్చి అభ్యర్థించాం. చేసిన పనులను చెబుతూ చేయబోయే పనులను కూడా చెబుతూ ఈసారి ఓట్లు అభ్యర్థిస్తున్నామన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో మంచినీళ్ల సమస్య తీర్చేందుకు వందల కోట్లు ఖర్చుపెట్టామని... కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, కరెంటు సమస్య తీర్చుకున్నామని కేసీఆర్ చెప్పారు.