
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ టెక్నాలజీ, సామాజిక మాధ్యామాలను ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా ట్విట్టర్ లో ఆయన ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. దీంతో చాలా మంది తమ సమస్యలను ఆయనకు ట్విట్ ల ద్వారానే తెలియజేస్తున్నారు. వీటికి కేటీఆర్ స్పందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా #askktr పేరిట ట్విట్టర్ లైవ్ నిర్వహించిన ఆయన ప్రజల సమస్యలపై స్వయంగా స్పందించారు.
ఇప్పటివరకు ప్రజా సమస్యలపై వాడిన సోషల్ మీడియాను కేటీఆర్ ఇప్పుడు పార్టీ విజయం కోసం వాడుతున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ విజయం కోసం విజయవాడ నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టిన ఓ యువకుడిని కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. అతడికి మన మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఏపికి చెందిన రోహిత్ రెడ్డి అనే యువకుడు టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కు మద్దతుగా విజయవాడ నుండి హైదరాబాద్ కు పాదయాత్ర చేపట్టాడు. ఈ వార్త సోషల్ మీడియాతో పాటు పలు చానళ్లలో కూడా ప్రసారమైంది. అయితే శ్రీనివాస్ అనే వ్యక్తి రోహిత్ చేస్తున్న పాదయాత్ర గురించి వివరిస్తూ ఓ వీడియోను జతచేసి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు కేటీఆర్ రీట్వీట్ చేశారు.
'' టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కు మద్దతుగా పాదయాత్ర చేస్తూ తన ప్రేమను, అప్యాయతను వ్యక్తపర్చిన రోహిత్ కు ధన్యవాదాలు''అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.