మేము అలా చేసుంటే.. డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ ఊచలు లెక్క పెట్టేవారు: కేటీఆర్

By Sumanth Kanukula  |  First Published Oct 28, 2023, 1:23 PM IST

దేశంలో వృద్ధి రేటులో తెలంగాణ టాప్ 5 లో ఉందని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలన సాధించిన ఘనత ఇది అని చెప్పారు.


దేశంలో వృద్ధి రేటులో తెలంగాణ టాప్ 5 లో ఉందని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత దేశానికి తెలంగాణ దిక్సూచి అయిందని.. తొమ్మిదిన్నర ఏళ్లలో సీఎం కేసీఆర్ పాలన సాధించిన ఘనత ఇది అని చెప్పారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంత్రి కేటీఆర్..‘మీట్‌ ది ప్రెస్‌’ నిర్వహించారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్షా 14 వేలుగా ఉందని, ప్రస్తుతం అది రూ.3లక్షల 17 వేలకు పెరిగిందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి వివక్ష, కులమత భేదాలు లేకుండా జీవిస్తున్నారని చెప్పారు.

తెలంగాణలో ఎవరూ రెండో శ్రేణులు ఉండరని అన్నారు. తెలంగాణలో కరువు, కర్ఫ్యూలు లేవని చెప్పారు.  తాము పగ, ప్రతీకార రాజకీయాలు చేయలేదన్నారు. అలా చేసి ఉంటే డబ్బుల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి.. ఊచలు లెక్క పెట్టేవారని అన్నారు. రేపు ఎప్పుడు అయిన పోతాడేమో చూడాలని అన్నారు. కర్ణాటక నుంచి రైతులను తాము తీసుకొస్తున్నామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. మరి కర్ణాటకకు ఒకసారి పోయి చూద్దామా? అని ప్రశ్నించారు. అక్కడికి వెళ్లి చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని అన్నారు.  

Latest Videos

తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పులపాటు చేశారన్న ఆరోపణలు సరికాదన్నారు. గతంలో ఒకరు అర్బన్ డెవలప్‌మెంట్ అని అన్నారని, మరొకరు సంక్షేమం అన్నారని.. కానీ తాము అభివృద్ధి, సంక్షేమంలో సమతుల్యం సాధించామని తెలిపారు. అటు పల్లెలు, ఇటు పట్టణాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. 

ఐటీ రంగంలో బెంగళూరును హైదరాబాద్‌ దాటేసిందని చెప్పారు. ఐటీ ఎగుమతులు 400 శాతం పెరిగాయని తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందని  కేటీార్ చెప్పారు. దేశానికి అన్నపూర్ణగా ఎదిగిందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసింది శూన్యమని విమర్శించారు. తెలంగాణ ఆకాంక్షను దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ అణచివేసిందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సోనియా మోసం చేశారని అన్నారు.  తెలంగాణ కోసం వందల మంది బలిదానాలు చేసుకున్నారని.. అందుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని ఆరోపించారు. సోనియా గాంధీని బలిదేవత అన్నది రేవంత్‌ రెడ్డేనని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని విమర్శించారు. 

తాము తొమ్మిదిన్నరేండ్లలో లక్ష 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. మరో 90 వేల ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో ఇప్పుడు 33 జిల్లాల్లో వైద్య కళాశాలలు ఉన్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్దికి సహకరించలేదని అన్నారు. ప్రధాని మోదీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఎక్కడపోయాయని ప్రశ్నించారు. 

click me!