తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను శుక్రవారం ప్రకటించింది. అయితే ఈ జాబితా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను శుక్రవారం ప్రకటించింది. అయితే ఈ జాబితా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతోంది. తమను కాదని మరొకరికి జాబితాలో చోటుదక్కడంతో.. ఆయా స్థానాల్లో టికెట్లు ఆశించిన పలువురు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు. కాంగ్రెస్ రెండో జాబితా.. ఎల్లారెడ్డిలో కూడా అసమ్మతిని రగిల్చింది.
ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా మదన్ మోహన్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై ఎల్లారెడ్డి టికెట్ ఆశించిన సుభాష్ రెడ్డి వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే సుభాష్ రెడ్డి అనుచరుడిగా పేరున్న నాగిరెడ్డిపేట మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటి పై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
undefined
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎల్లారెడ్డి కాంగ్రెస్ టికెట్ సుభాష్ రెడ్డికి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే, ఎల్లారెడ్డి టికెట్ దక్కకపోవడంతో.. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుక ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డి వర్గీయులు ఈరోజు సమావేశం కానున్నారు.
ఇదిలాఉంటే, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్.. కేటీఆర్ సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సీనియర్ నేత ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.