ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుంది.. : కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ

By Sumanth Kanukula  |  First Published May 15, 2023, 2:24 PM IST

ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఫాక్స్‌ కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. 


హైదరాబాద్: ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణను ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌ సోమవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌లియూలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫాక్స్‌ కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. 

ఫాక్స్‌ కాన్‌ టెక్నాలజీస్‌ ప్లాంట్‌ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పారు. తొమ్మిది నెలల్లోని ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందని తెలిపారు.  ఈరోజు కంపెనీతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉందని చెప్పారు. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్తులోనూ విస్తరించెందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

Latest Videos

తెలంగాణ ప్రభుత్వం తనదైన వినూత్నమైన పరిశ్రమల అనుమతుల ప్రక్రియ టీఎస్‌ ఐ పాస్ ద్వారా ఇప్పటికే దేశంలో ప్రశంసలు పొందుతుందని  చెప్పారు. గత 9 ఏళ్లుగా  తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. దేశంలో గత సంవత్సరం వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాల్లో మూడింటిలో ఒకటి తెలంగాణలోనే వచ్చిందని చెప్పారు. దేశంలో గత ఏడాది వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాలు 33 శాతం తెలంగాణ నుంచి ఉండడం గర్వకారణమని చెప్పారు.  ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తించిందని తెలిపారు. చైనా మాదిరి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. 

ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణకి రావడంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ ప్రభుత్వ అధికారుల బృందానికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

click me!