Mancherial: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం వడగాల్పులు వీస్తాయనీ, ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 18 వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందనీ, మే 14 నుంచి 18 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Heatwave in Telangana, Andhra Pradesh: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలోనే మంచిర్యాలలో వడదెబ్బకు గురై ఒక పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ (42) వడదెబ్బతో మృతి చెందిన సంఘటన లక్సెట్టిపేట పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. అంకతివాడకు చెందిన ముత్తె సంతోష్ రాత్రి 10.30 గంటల సమయంలో తన నివాసంలో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని లక్సెట్టిపేటలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్ రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు ముగించుకుని ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చాడు. వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంతోష్ 2000లో పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మండిపోతున్న ఎండలు..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం వడగాల్పులు వీస్తాయనీ, ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ నెల 18 వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందనీ, మే 14 నుంచి 18 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాలలో 45.5 డిగ్రీలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ లో 45.4 డిగ్రీలు, నిజామాబాద్ లో 45.1 డిగ్రీలు, నల్లగొండలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ గణాంకాలు పేర్కొన్నాయి.
ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో ప్రజలు బయటకు రావొద్దని ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని 127 మండలాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయనీ, 173 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో 47 డిగ్రీలు, ఏలూరు, కృష్ణా, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 45-47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.