బొగ్గు కేటాయింపులు.. మోడీ ఇండోనేషియా వెళ్తే వాళ్ల ఫ్రెండ్స్‌కు గనులు : ఈటలకు కేటీఆర్ కౌంటర్

By Siva KodatiFirst Published Feb 10, 2023, 4:59 PM IST
Highlights

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేనేత రంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు మంత్రి కేటీఆర్. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలను కేంద్రం కోరిందని ఆయన మండిపడ్డారు. 

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కేంద్రానికి సింగరేణిని ప్రైవేట్‌పరం చేయాలనే ఆలోచన లేదన్నారు ఈటల రాజేందర్. సింగరేణికి బ్లాక్‌లు కేటాయిస్తే , రాష్ట్ర ప్రభుత్వం వద్దని లేఖ రాసిందని ఆయన దుయ్యబట్టారు. బొగ్గు బ్లాక్‌లు వద్దని రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ తన వద్ద వుందన్నారు రాజేందర్. 

ఈటల చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటరిచ్చారు. దేశంలో బొగ్గు బ్లాక్‌లు కొనొద్దని కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందన్నారు. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని రాష్ట్రాలను కోరిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఎవరి ప్రయోజనాల కోసం కేంద్రం అలా కోరుతోందని మంత్రి ప్రశ్నించారు. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్ముతోంది కేంద్రం కాదా అని ఆయన ప్రశ్నించారు. సింగరేణి విషయంలో కూడా ఇదే వైఖరిలో కేంద్రం వుందని కేటీఆర్ అన్నారు. ప్రధాని మోడీ ఇండోనేషియా వెళ్తే వాళ్ల ఫ్రెండ్స్‌కు గనులు వస్తాయని మంత్రి దుయ్యబట్టారు. ఒకరి కోసం , దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం తమది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వంలా ఒక వ్యక్తినే పల్లకిలో మోయమని కేటీఆర్ స్పష్టం చేశారు. 

Latest Videos

భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పించేది చేనేత , జౌళి రంగమేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్‌లో చేనేత జౌళి రంగానికి రూ.70 వేల కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక.. ఈ రంగం అభివృద్ధికి కేటాయింపులు పెంచారని కేటీఆర్ గుర్తుచేశారు. 14 మంది ప్రధానులు చేయని విధంగా .. మోడీ చేనేత ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధించడంతో పాటు తాము ఎన్నిసార్లు చెప్పినా, లక్షల సంఖ్యలో ఉత్తరాలు రాసినా స్పందించడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. 5 శాతం పన్ను సరిపోదని, దానిని 12 శాతానికి పెంచి చేనేత కార్మికులను చావగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇకనైనా 5 శాతం పన్ను ఆలోచనను విరమించుకోవాలని మంత్రి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

ఆలిండియా హ్యాండీ క్రాఫ్ట్స్ బోర్డును రద్దు చేశారని, ఆలిండియా పవర్‌లూమ్ బోర్డును సైతం రద్దు చేశారని దీని వల్ల దాని కింద పనిచేసే 8 టెక్స్‌టైల్ పరిశోధనా సంస్థలు కూడా నిర్వీర్యమైపోయాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఆలిండియా జూట్ బోర్డ్ స్థానిక కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తొలగించారని, చేనేత సహకార సంఘా సభ్యుల త్రిఫ్ట్ ఫండ్ పథకంలో 4 శాతంగా వున్న కేంద్ర వాటాను రద్దు చేశారని కేటీఆర్ తెలిపారు. చేనేత కార్మికుల కోసం ఉద్దేశించిన లాంబార్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ రద్దు చేశారని, అలాగే బున్కర్ బీమా యోజన పథకాన్ని 2014లోనే రద్దు చేశారని, అలాగే హౌస్ కమ్ షెడ్ పథకం సైతం రద్దుచేశారని మంత్రి గుర్తుచేశారు.కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ ఇన్సింటివ్ పథకం నిబంధనలను తొలగించారని ఆయన ఎద్దేవా చేశారు.  
 

click me!