ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నిందితులకు నార్కో, లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా : కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్

By Siva KodatiFirst Published Dec 27, 2022, 8:09 PM IST
Highlights

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. ఈ కేసులో దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్ట్‌లకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. 
 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్ట్‌లకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు  కేసులో దొంగల ముసుగులు తొలగాయన్నారు. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సంబంధం లేదన్నవారే దొంగలను భుజాలపై మోస్తున్నారని మంత్రి ఆరోపించారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్ రెడ్డికి సంబరమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబరాలు చేసుకోవడం వెనుక మర్మమేంటని ఆయన నిలదీశారు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటికొస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారని.. నేరం చేసినవాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోలేరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 

అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల దృష్టిలో మరల్చేందుకు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు ఆడటం , కొత్త కథలు చెప్పడం , కొత్త కొత్త నటులతో కొత్త సినిమాలు తీయడం టీఆర్ఎస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు . పాలనను గాలికొదిలేసి, తన అస్ధిత్వాన్ని కాపాడుకునేందుకు ఇతరుల మీద బురద జల్లడం కల్వకుంట్ల కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. రాష్ట్రంలో అనేక సందర్భాలలో , రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన న్యాయస్థానాలు సుమోటాగా తీసుకుని మొట్టికాయలు కొట్టిందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. చివరికి రాష్ట్రంలో ప్రజలు తమ నిరసన తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఇందిరా పార్క్ దగ్గర  ధర్నాలు చేయరాదని బీఆర్ఎస్ ప్రభుత్వం హుకుం జారీ చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు మండిపడిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. 

Also REad: ఆ సాక్ష్యాలు సీఎంకు ఎవరిచ్చారు: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రజాస్వామ్యంలో ప్రజలు ధర్నాలు చేసుకునేందుకు హక్కు వుందని, ఆపడానికి మీరెవరు అంటూ హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా వీళ్లకు చీమ కుట్టినట్లయినా వుండదన్నారు. తనకు, తన కుటుంబానికి, తన పార్టీకి ఎవరైనా ప్రత్యామ్నాయంగా వ్యక్తులు కానీ, శక్తులు గానీ ఎదుగుతున్నారంటే వారి ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పసలేని విమర్శలు చేయడం, అబద్ధాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేయడం, గారడి మాటలతో మసిపూసి మారేడు కాయ చేయడం .. అది ఒక్క కేసీఆర్‌కే చెల్లుతుందన్నారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే డ్రామాలు ఆడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, నిర్మాతగా కేసీఆర్ తెరకెక్కించిన ఫామ్ హౌస్ ఫైల్స్ సినిమాను విడుదల చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను జీర్ణించుకోలేక సరిగ్గా మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఫామ్‌హౌస్ డ్రామాను ఆడారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. 
 

click me!