మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ.. ఆ పిటిషన్ డిస్మిస్..

By Sumanth KanukulaFirst Published Jun 28, 2022, 3:21 PM IST
Highlights

2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొప్పుల ఈశ్వర్ ఎన్నిక సరికాదని.. ధర్మపురి స్థానం నుంచి ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ  మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొప్పుల ఈశ్వర్ ఎన్నిక సరికాదని.. ధర్మపురి స్థానం నుంచి ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదరి, రీ కౌంటింగ్ జరపాలని కోరారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, కొప్పుల ఈశ్వర్‌కు అధికారులు సహకరించారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. పోలైన ఓట్లకు, ఫలితాల్లో తేల్చిన ఓట్లకు తేడా ఉందని లక్ష్మణ్ కుమార్ చెబుతున్నారు.

అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. 

ఇదిలా ఉంటే ఇటీవల లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ అన్యాయంగా గెలిచారని ఆరోపించారు. ధర్మపురి అసెంబ్లీ ఓట్లను మళ్లీ లెక్కించాలన్నారు. కౌంటింగ్ కోసం కొప్పుల ఈశ్వర్ పిటిషన్ వేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. మూడేళ్లుగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని.. జూలై 3 లోగా న్యాయం జరగకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానన్నారు. తనకు ఏదైనా జరిగితే.. సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధ్యత వహించాలని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.

click me!