భర్తను కోల్పోయిన మహిళతో సహజీవనం చేస్తున్నవాడే ఆమె ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన దారుణం హైదరాబాద్ శివారులోని పహాడిషరిఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ : ఇద్దరు చిన్నారులు రెండురోజులుగా కనిపించకుండా పోవడం హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. భర్తను కోల్పోయిన వివాహితతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమె పిల్లలను కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాడో, వారిని ఏం చేసాడో తెలియడం లేదు. మహిళ పిర్యాదుతో ఇద్దరు చిన్నారుల ఆఛూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ శివారు పహడిషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జలపల్లి శ్రీరామ్ కాలనీలో లీలం యాదవ్-జితేందర్ ఇద్దరు పిల్లలు ప్రీతి (2సంవత్సరాలు), రితేష్ (16 నెలలు) తో కలిసి నివాసముండేవారు. ఏడాదిక్రితం జితేందర్ యాదవ్ మరణించడంతో పిల్లల ఆలనా పాలనా తల్లి లీలం యాదవ్ చూసుకుంటోంది. సమీపంలోని ఓ కంపనీలో పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది.
undefined
భర్త లేకుండా పిల్లలతో వుంటున్న లీలం యాదవ్ పై అజయ్ (35) కన్నుపడింది. ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్న అజయ్ కుటుంబానికి అండగా వుంటానని నమ్మించాడు. దీంతో అతడితో లీల సహజీవనం ప్రారంభించింది. ఇద్దరు పిల్లలతో లీల, అజయ్ ఒకే ఇంట్లో వుండేవారు.
రెండురోజుల క్రితం లీల కంపనీకి వెళ్లి సాయంత్రం తిరిగివచ్చింది. ఇదే సమయంలో ఇంట్లో ఆడుకుంటున్న ఆమె పిల్లలు ప్రీతి, రితేష్ ను అజయ్ చితకబాదుతున్నాడు. దీంతో తల్లి అతడి అడ్డుకుని చిన్నారులను కాపాడింది. కొద్దిసేపటి తర్వాత లీల ఇంటిపనుల్లో నిమగ్నమవగా ఇద్దరు చిన్నారులను తీసుకుని అజయ్ బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ వారు ఇంటికి తిరిగిరాకపోవడంతో కంగారుపడిపోయిన తల్లి చుట్టుపక్కల వెతికింది. ఎక్కడా వారి ఆఛూకీ లభించలేదు.
ఇలా రెండు రోజులు గడిచిపోయినా చిన్నారుల ఆఛూకీ ఇప్పటివరకు లభించలేదు. తల్లి లీల ఫిర్యాదుతో పహడిషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి చిన్నారుల కోసం గాలింపు చేపట్టారు. మహిళ నివాసానికి సమీపంలోని సిసి కెమెరాల ఆదారంగా అజయ్ చిన్నారులను ఎక్కడికి తీసుకెళ్లాడో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలావుంటే దాదాపు ఎనిమిది ఏళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓ టీవీ కార్యక్రమం ఆ బాలిక పాలిట వరంలా మారి అనాథ జీవితానికి తెరపడింది. టీవిలో చిన్నారిని చూసి గుర్తుపట్టిన తల్లిదండ్రులు ఆఛూకీ కనుక్కుని ఇంటికి తీసుకొచ్చుకున్నారు.
ఈసీఐఎల్ కమల నగర్ కు చెందిన పిన్నమోని కృష్ణ, అనురాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇందూ, సింధు కవలలు. 2014లో వినాయక చవితి ఉత్సవాలకు వెళ్లిన సందర్భంగా ఇందూ అనే మూడున్నరేళ్ల కుమార్తె తప్పిపోయింది. ఆ సమయంలో ఆ పాపను ఓ మహిళ తీసుకువెళ్లినట్లుగా సీసీటీవీలో కూడా ఫుటేజ్ లభించింది. దాంతో తల్లిదండ్రులు ఆ రోజు నుంచి చాలా ప్రాంతాల్లో అమ్మాయి కోసం వెతికారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇటీవల ఓ టీవీ చానెల్ కార్యక్రమంలో ఆ పాప కనిపించడంతో తల్లిదండ్రుల గుర్తించి.. తమ కూతురులాగానే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీశారు. టీవీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులను కలిసి విషయం తెలిపారు. వారి సహాయంతో కిస్మిత్ పూర్ లోని చెరిస్ అనాథ బాలికల సంరక్షణ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ తమ కూతురు వుండటంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండాపోయింది. ఇంతకాలం అనాథలా బ్రతికిన కూతురిని ఇంటికి తీసుకెళ్ళారు తల్లిదండ్రులు.