
కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు. ఈటెల రాజేందర్ కు హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గంలో మద్దతు లేకుండా చేయాలనే లక్ష్యంతో హరీష్ రావు ఆపరేషన్ ప్రారంభించారు హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులతో హరీష్ రావు సమావేశమయ్యారు.
తాము ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని పలువురు ప్రజా ప్రతినిధులు చెప్పారు. ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ ను కట్టడి చేసే బాధ్యతను మంత్రి గంగుల కమలాకర్ నిర్వహిస్తూ వచ్చారు. గంగుల కమలాకర్ ఈటెల రాజేందర్ ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే అభిప్రాయంతో కేసీఆర్ హరీష్ రావుకు హుజూరాబాద్ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ లో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ గా పేరుంది. ఆయన తనకు అప్పగించిన పనిని సమర్థంగా నిర్వహిస్తారనే విశ్వాసం కేసీఆర్ కు ఉంది. పలు ఎన్నికల్లో ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుని వచ్చారు.
నిజానికి, హరీష్ రావు, ఈటెల రాజేందర్ అత్యంత సన్నిహితులుగా పేరు పడ్డారు. హరీష్ రావు కూడా కొంత కాలం కేసీఆర్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. హరీష్ రావు, ఈటెల జోడీని దెబ్బ తీయడంలో కేసీఆర్ విజయం సాధించినట్లుగా భావించాల్సి ఉంటుంది. చాలా కాలంగా ఈటెల రాజేందర్ మీద కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు
ఈటెల రాజేందర్ తన అసంతృప్తిని వివిధ రూపాల్లో బయపెడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు ఈటెల రాజేందర్ క్రమంగా దూరమవుతూ వచ్చారు. చివరకు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు. ప్రస్తుతం హుజూరాబాద్ లో తన పలుకుబడిని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో ఈటెల రాజేందర్ పడ్డారు.