
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విద్యుత్ అంశంలో కేంద్రం తెలంగాణ గొంతు నొక్కుతుందని ఆరోపించారు. బీజేపీ సర్కార్ కుట్రలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోడీ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో కేంద్రానికి, ఎన్‌ఎల్‌డీసీ, ఎస్ఎల్‌డీసీల ప్రమేయం ఉండదన్నారు. ఉత్పత్తిదారులకు డిస్కం లేదా ట్రాన్స్‌కో, జెన్‌కో మధ్య కుదిరే ఒప్పందం మాత్రమేనని తెలిపారు. సంబంధం లేకున్నా కేంద్రం తల దూరుస్తుందని ఆరోపించారు. కేంద్రం చేసేది ముమ్మాటికి దాదాగిరినే అని మండిపడ్డారు.
బీజేపీ పాలకుల దాదాగిరి వీధి రౌడీలను తలపిస్తుదన్నారు. కేంద్రం దిగజారుడుతనానికి ఇది నిదర్శనమని మండపడ్డారు. లేని అధికారాలు తీసుకని బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు బీజపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా చేయలేకనే ఈ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. గుజరాత్‌లో వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ సరఫరా చేయలేని దుస్థితి ఉందన్నారు. పరిశ్రమలకు రెండు రోజులు అధికారికంగా.. ఒక రోజు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని చెప్పారు.
2014 కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా అద్వాన్నంగా ఉండేదన్నారు. ప్రస్తుతం గుజరాత్ తో సహా బిజెపి పాలిత రాష్ట్రాలలో అదే పరిస్థితి ఉత్పన్నమౌతుందని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను అడ్డుకోవాలని కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆ కుట్రలను అమలు పరిచేందుకే విద్యుత్ సరఫరా దారులపై కేంద్రం ఒత్తిడి తెస్తుందన్నారు. ఎంత ఖర్చు అయినా సరే విద్యుత్ సరఫరాకు ఆటంకం రానివ్వమని చెప్పారు. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించినట్టుగా చెప్పారు.