కడెం ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి . పరిస్ధితి అదుపులోనే వుందని వదంతులు నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు. డెం ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు వరద గేట్ల మరమ్మత్తుల కోసం నిపుణుల కమిటీ చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు భారీ వరద పోటెత్తింది. ప్రాజెక్ట్ స్థాయికి మించి వరద కొనసాగుతూ వుండటంతో పాటు నాలుగు గేట్లు కూడా పనిచేయకపోవడంతో ఆనకట్ట సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని ప్రస్తుతం 14 గేట్లు తెరిచి ఎప్పటికప్పుడు కిందికి వదులుతున్నామన్నారు. లక్షల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహం రావడంతో కడెం ప్రాజెక్టు వరద గేట్లపై నుంచి నీటి ప్రవాహం కొనసాగిందని మంత్రి తెలిపారు.
కడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని స్వయంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిశీలించామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తనతోపాటు స్థానిక ఎమ్మెల్యే రేఖ శాం నాయక్, జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి , ఎస్పీ ప్రవీణ్ కుమార్ , ఇరిగేషన్ అధికారులతో డ్యామ్ వద్దకు వెళ్లి వరద పరిస్థితిని అంచనా వేశామని చెప్పారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొద్దిగా తగ్గినప్పటికీ ఎగువ భాగంలో భారీ మొత్తంలో వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నందున అధికారులను అప్రమత్తం చేశామని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Also Read: మున్నేరు ఉగ్రరూపం.. మానేరు నదిలో పలువురు గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ప్రాజెక్టు కింద భాగంలో ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి వెల్లడించారు. వారికి శిబిరాలలో భోజన వసతి ఉండేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. కడెం ప్రాజెక్టుపై ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలు వరదలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
ఇలాంటి వదంతులు ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిది కాదన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయడానికి కలెక్టర్లు అప్రమత్తమయ్యారని మంత్రి పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతేనే ప్రజలకు బయటకు రావాలని ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు వరద గేట్ల మరమ్మత్తుల కోసం నిపుణుల కమిటీ చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు.