
నిర్మల్ : బిఆర్ఎస్ పార్టీని ప్రత్యక్షంగా ఎదుర్కోలేకే తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బిజెపి కుట్రలు పన్నుతోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్ లోనే పేపర్ల లీకేజీ జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి అన్నారు.తెలంగాణపై కక్ష్యగట్టిన కేంద్రం సుపరిపాలన అందిస్తున్న కేసీఆర్ పై నిందలు వేస్తోందని మంత్రి అన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తాలో పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ దిష్టి బొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేసాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. దిష్టిబొమ్మ దహనం అనంతరం మంత్రి మాట్లాడుతూ బండి సంజయ్, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందని మంత్రి అన్నారు. తాజాగా పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నాయకులు చాలామందికి ప్రత్యక్ష సంబంధాలు వున్నాయన్నారు. గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఇలా వరుసగా పేపర్ లీకేజీలు ఘటనలు జరగలేవన్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని బిజెపి నాయకులు చూస్తున్నారని... పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూ పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టబోమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హెచ్చరించారు.
Read More మోదీ ఎదుర్కొనేందుకే కేసీఆర్ పేపర్లు లీక్ చేస్తున్నాడు..: సోము వీర్రాజు
మొన్నటికి మొన్న ఉద్యోగ నియామకాల కోసం టీఎస్ పిఎస్సి చేపట్టే పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేసినవారిలో బిజెపి సానుభూతిపరులు వున్నట్లుగా తేలిందన్నారు. ఇప్పుడు పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజిలోనూ బిజెపి హస్తం వుందని తేలిందన్నారు. కాబట్టి బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోందని ఇంద్రకరణ్ తెలిపారు.
మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ ఘటనపై స్పందించారు. తెలంగాణలో జరుగుతున్న టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ లో పేపర్ లీక్ వ్యవహారంలో సూత్రదారి బీజేపీ బండి సంజయే... ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు లభించాయని మంత్రి పేర్కొన్నారు. లక్షల మంది పిల్లలు భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల బాధను బిజెపి నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదని...సమాజం పట్ల కనీస బాధ్యత కూడా లేకుండా బండి సంజయ్ ప్రవర్తించాడని ఆరోపించారు. కేవలం కేసిఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుందన్నారు.
ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కి క్వశ్చన్ పేపర్ ఫోటోను ఫోన్లో పంపించాడని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పరీక్ష మొదలైన కేవలం 15 నిమిషాల్లోనే సంజయ్ కు క్వశ్చన్ పేపర్ చేరిందన్నారు. సంజయ్, బీజేపీ వాళ్ళతో ప్రశాంత్ 140 సార్లు ఫోన్లో మాట్లాడాడని తెలిపారు.
వాళ్లే ఉద్దేశ పూర్వకంగా లీక్ చేస్తారు...వాళ్లే మీడియాకి పంపిస్తారు... చివరకు పేపర్ లీక్ అయ్యింది... ఆ పేపర్ నాకు వచ్చింది.. ప్రభుత్వం విఫల మయ్యింది అని ప్రచారం చేస్తారంటూ బిజెపి నాయకులపై ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. బండి అరెస్ట్ పై బీజేపీ నాయకులు కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేస్తే ఖబర్దార్...భౌతిక దాడులు తప్పవు అని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.