
ఖమ్మం: Bhadrachalam లోని శ్రీ సీతారామ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆదివారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా Srirama Navami ని పురస్కరించుకొని ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించే సమయం ఆధారంగానే దేశంలోని అన్ని ఆలయాల్లో అదే సమయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు.
గత రెండేళ్లుగా భద్రాచలంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని భక్తులు లేకుండానే సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో సీతారాముల కళ్యాణోత్సవానికి ఈ ఏడాది మాత్రం భక్తులను అనుమతించారు. సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు Indrakaran Reddy, పువ్వాడ అజయ్ కుమార్ లు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. TTD తరపున పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మెన్ YV Subba Reddy అందించారు.
సీతారాముల కల్యాణం తిలకించేందుకు రెండేండ్ల తర్వాత భక్తులకు అనుమతించడంతో ఇవాళ పెద్ద ఎత్తున స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చారు. దీంతో భద్రాచలం ఆలయ వీధులు భక్తజనసందోహంగా మారాయి. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. రేపు శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
కళ్యాణోత్సవానికి హాజరైన భక్తులకు పంపిణీ చేసేందుకు సుమారు 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను అధికారులు సిద్దం చేశారు. స్వామి వారి కళ్యాణాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గాను ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.