
RYTHU BIMA: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబీమా పథకం ఐదేండ్లు పూర్తి చేసుకున్నది. ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ 2018 ఆగస్టు 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది రైతు కుంటుబాలకు ఆర్థిక భద్రతను లభిస్తోంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేండ్లలో వివిధ కారణాలతో చనిపోయిన 1,08,051 మంది రైతులకు ఈ పథకం కింద బాధిత రైతు కుటుంబాలకు రూ.ఐదేసి లక్షల చొప్పున రూ. 5,402.55 కోట్ల పరిహారాన్ని అందించింది. రైతుకు ఎంత భూమి ఉన్నదనే సంబంధం లేకుండా 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వయసు రైతుల అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా అందిస్తోంది. రైతులకు ఒక్క రూపాయి వసూలు చేయకుండా.. రాష్ట్ర ప్రభుత్వమే .. రైతు బీమా ప్రీమియం చెల్లిస్తోంది. రైతులకు బీమా అందిస్తున్న ఏకైక ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచింది.
రైతుబీమా పథకం ఐదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ కు తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు బీమా అందిస్తున్న ప్రభుత్వం ప్రపంచంలో మరెక్కడా లేదంటూ సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు. రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి, రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ కీర్తించారు.
ఏ కారణంతో రైతు చనిపోయినా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 15న ప్రారంభించారనీ, ఈ రైతు బీమా పథకం నేటితో ఐదేండ్లు పూర్తి చేసుకున్నదని తెలిపారు. అర్హులైన రైతులందరి తరపున ప్రభుత్వమే ఎల్ఐసికి (LIC)ప్రీమియం చెల్లిస్తుందనీ, ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వమే బాసటగా నిలుస్తూ.. రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ పథకం ప్రారంభించిన తొలి ఏడాది(2018-19)లో 31.25 లక్షల మంది రైతులు తమ పేరు నమోదు చేసుకున్నారనీ, 2023-24 నాటికి ఆ సంఖ్య 41.04 లక్షలకు పెరిగిందని తెలిపారు. 2018లో రూ.602 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తే.. నేడు రూ. 1477 కోట్లు ప్రీమియంగా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతుల తరుపున ప్రభుత్వం రూ.6861 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లించగా, వివిధ కారణాలతో ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5,402 కోట్ల ఆర్థిక సాయం అందించిందని గుర్తు చేశారు.
గుంట భూమి ఉన్నా చాలు, వారిని రైతుగా గుర్తించి.. ఆ రైతన్న మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందించే అద్భుతమైన రైతు బీమా పథకం ప్రపంచంలో మరెక్కడా లేదని, రైతుల గురించే కాదు, రైతుల కుటుంబాల గురించి కూడా ఆలోచించే మనసున్న ముఖ్యమంత్రి రైతు బాంధవుడని, సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.