పిల్లలకు ఫోన్ దూరంగా వుంచండి.. తల్లిదండ్రులకు హరీశ్ రావు సూచన, ఆ జీపీఏ తెచ్చుకునే విద్యార్ధులకు మంత్రి గిఫ్ట్

By Siva KodatiFirst Published Jan 11, 2023, 8:21 PM IST
Highlights

పదో తరగతి పిల్లలకు ఫోన్ దూరంగా వుంచేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పదికి పది జీపీఏ తెచ్చుకునే విద్యార్ధులకు రూ.10 వేల బహుమతి ఇస్తానని, 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలలకు రూ.25 వేలు బహుమతిగా ఇస్తానని మంత్రి స్పష్టం చేశారు.
 

పదో తరగతి పిల్లలకు ఫోన్ దూరంగా వుంచేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్ధులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు వారి సమయాన్ని కేటాయించాలని సూచించారు. పిల్లలు ఫోన్‌కు త్వరగా ఆకర్షితులవుతారని.. అందువల్ల తల్లిదండ్రులు ఓ కన్నేసి వుంచాలని మంత్రి పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రంలోనే సిద్ధిపేట జిల్లా తొలిస్థానంలో వుందని, ఈసారి కూడా తొలి స్థానంలో నిలిచిందని హరీశ్ రావు తెలిపారు. 

పదికి పది జీపీఏ తెచ్చుకునే విద్యార్ధులకు రూ.10 వేల బహుమతి ఇస్తానని, 100 శాతం ఉత్తీర్ణత సాధించే పాఠశాలలకు రూ.25 వేలు బహుమతిగా ఇస్తానని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకు ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు ఆదేశించారు. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతోందని హరీశ్ రావు అన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి స్థానం లేదని ఆయన చెప్పారు. 

ALso REad: కొత్త మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి హరీశ్ రావు ఆదేశాలు

ఇకపోతే.. గత వారం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం), తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) పనులపై శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో హరీశ్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ప్ర‌భుత్వం ప్ర‌జా ఆరోగ్య రంగానికి అధిక ప్రాముఖ్య‌త‌ను ఇస్తున్న‌ద‌ని చెప్పిన ఆయన కొత్త వైద్య కళాశాలల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ ప్రాసెసింగ్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు.

కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్‌, జంగం, నిర్మల్‌, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్‌ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా తరగతులు ప్రారంభించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరగతుల ప్రారంభానికి సంబంధించిన అన్ని పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలనీ, జాతీయ వైద్య మండలి తనిఖీ బృందం వచ్చేలోపు కళాశాలలు సిద్ధంగా ఉండాలని హరీశ్‌రావు ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్త్రీ, శిశు సంక్షేమ కేంద్రాల నిర్మాణ పనులను కూడా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచ‌న‌లు చేశారు.  ఆసుపత్రులకు మందుల సరఫరాపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. అన్ని రకాల మందులు ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండాలి.. ప్రతి ఆసుపత్రి మూడు నెలల పాటు మందుల బఫర్ స్టాక్‌ను నిర్వహించాలి అని సంబంధిత అధికారుల‌కు హ‌రీశ్ రావు ఆదేశాలిచ్చారు.
 

click me!