
దేశంలో 20 గ్రామాలకు అవార్డులు వస్తే అందులో 19 తెలంగాణలోనివేనన్నారు మంత్రి హరీశ్ రావు (Harish rao) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది తెలంగాణ ప్రభుత్వ పనితనమని అన్నారు. ఇది జీర్ణించుకోలేని బీజేపీ (bjp) , కాంగ్రెస్‌లు (congress) దుష్ప్రచారం చేస్తున్నాయని హరీశ్ ఆరోపించారు. నిన్నటి వరకు అందరికీ బిల్లులు క్లియర్ చేశామని మంత్రి వెల్లడించారు. ఉపాధి హామీ పనులు మన దగ్గరే ఎక్కువ జరిగాయని హరీశ్ వెల్లడించారు. బీజేపీ అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఎందుకు అవార్డులు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రానికి లేఖలు రాసి రాష్ట్రానికి నిధులు రప్పించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని (bandi sanjay) మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
అంతకుముందు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్ అయితే.. బీజేపీ మోటర్ల దగ్గర మీటర్లు పెట్టే పార్టీ అంటూ హరీశ్ సెటైర్లు వేశారు. టీఆర్ఎస్ అంటే 24 గంటలు కరెంట్ అని మంత్రి అభివర్ణించారు. బోర్లకు మీటర్లు పెట్టని రాష్ట్రం తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగానికి డిమాండ్ ఉండేదని.. ఇప్పుడు దానికి దీటుగా వ్యవసాయం చేసే రైతులకు డిమాండ్ ఏర్పడిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి వెల్లడించారు. రైతు బీమా పథకం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి పేర్కొన్నారు.
Also Read:తెలంగాణ సివిల్స్ విజేతలకు మంత్రి హరీష్ అల్పాహారవిందు
ఉమ్మడి ఏపీలో ఆకలి చావులు, కాలిపోయే మోటార్లు, గుక్కెడు నీళ్లు లేకపోయేవని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో 24 గంటల కరెంట్, పుష్కలమైన నీళ్లు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు బీమా పథకం దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదని.. రైతు బీమా ద్వారా అత్యధిక రైతు ఆత్మహత్యలు నిలిపేసిన ప్రభుత్వం.. తెలంగాణ సర్కార్ అని వ్యాఖ్యానించారు. బోర్ల కాడ మీటర్లు పెడితేనే నిధులు ఇస్తామని కేంద్రం అంటే.. నిధులు ఇవ్వకున్నా సరే కానీ మీటర్లను మాత్రం పెట్టమని చెప్పిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.