
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ నేత (trs) , మంత్రి హరీశ్ రావు (harish rao) . పెద్దపల్లిలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో కరెంట్ కోతలు తప్ప ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రెండుసార్లు మోటర్లు, ఒకసారి ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ చేసింది ఏంటో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో ముందుకు పోతున్న తెలంగాణలో రాహుల్ గాంధీ వచ్చి ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకున్న తరువాతనే కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. సొల్లు కబుర్లు చెప్పి, బురదజల్లెందుకే కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఫైరయ్యారు. ఐదేళ్లు ఒకే ముఖ్యమంత్రి కొనసాగిన చరిత్ర కాంగ్రెస్‌లో లేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర అవిర్బావం జరగొద్దని వారించిన తెలంగాణ ద్రోహి చంద్రబాబు నాయుడంటూ ఆయన ధ్వజ మెత్తారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన చరిత్ర కాంగ్రెస్‌దన్నారు. అధికారం కోసం ఎంత నీచమైన స్తాయికైనా దిగజారే పరిస్థితి వారిదంటూ ఎద్దేవా చేశారు. రాహుల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ గల్లంతేనని హరీశ్ రావు సెటైర్లు వేశారు.
కేంద్రంలో ఉన్న 15 లక్షల 62 వేల పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలంటూ బండి సంజయ్‌కి ఆయన సవాల్ విసిరారు. 90 వేల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే వారి నోటి నుంచి మాట రావడం లేదన్నారు. 18 కోట్లతో, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో 100 పడకల మాతా శిశు ఆసుపత్రి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు 6 మాత్రమే ఉంటే, ఇప్పుడు ఈ ఆస్పత్రుల సంఖ్య 28కి చేరిందని హరీశ్ రావు తెలిపారు.
కాగా.. కాంగ్రెస్ (congress) అగ్రనేత రాహుల్ గాంధీ (rahul gandhi) ఓయూ పర్యటనకు (osmania university) తెలంగాణ హైకోర్టు (telangana high court) అనుమతి మంజూరు చేసింది. రాహుల్ సభకు అనుమతించాలని ఓయూ వీసీని హైకోర్టు ఆదేశించింది. విద్యార్ధులతో రాహుల్ ముఖాముఖికి న్యాయస్థానం అనుమతించింది. 150 మందితో మాత్రమే అనుమతించాలని వీసీని ఆదేశించింది.
అంతకుముందు ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతించాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది న్యాయస్థానం. విద్యార్ధుల సమస్యలు తెలుసుకునేందుకే.. రాహుల్ వస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. గతంలో వివిధ పార్టీలు చాలా సమావేశాలు పెట్టాయని.. ఇప్పుడు ఎందుకు అనుమతివ్వడం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్ బెంచ్ ఆదేశాలతో మళ్లీ దరఖాస్తు చేసుకున్నామని.. అయినా అనుమతి నిరాకరించారని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.