పైరవీల కోసం నా దగ్గరికి రావొద్దు.. మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 31, 2022, 6:37 PM IST
Highlights

యువ వైద్యులు రెండు మూడేళ్ల పాటు పోస్టింగ్ ఇచ్చిన చోటే పనిచేయాలని , పైరవీల కోసం రావొద్దన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. కరోనా సమయంలో మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వారికి వెయిటేజ్ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

బదిలీల కోసం వైద్యులు పైరవీలకు రావొద్దని కోరారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ హైటెక్ సిటీలో వున్న శిల్ప కళా వేదికలో శనివారం కొత్తగా పోస్టింగ్‌లు అందుకున్న డాక్టర్ల పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 929 మంది డాక్టర్లకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన డాక్టర్లకు పీజీలో వెయిటేజీ ఇచ్చినట్లు తెలిపారు. రెండు మూడేళ్ల పాటు పోస్టింగ్ ఇచ్చిన చోటే పనిచేయాలని హరీశ్ రావు కోరారు. పేదలకు సేవలందిస్తే కౌన్సింగ్‌లో వెయిటేజ్ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. డాక్టర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా సాగిందని... ఒకేసారి ఇంత మందికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం ఇదే తొలిసారని హరీశ్ రావు పేర్కొన్నారు. సమాజ సేవకు డాక్టర్లను పంపినందుకు తల్లిదండ్రులు, గురువులకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా సమయంలో మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వారికి వెయిటేజ్ కల్పించిన విషయాన్ని హరీశ్ గుర్తుచేశారు. 

ఇదిలావుండగా... నిన్న దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన  బహిరంగ సభలో  హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో  ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు బీజేపీ పాల్పడుతుందని ఆరోపించారు. తెలంగాణలో  30 సీట్లు కూడా  రావని ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్   అంటున్నారన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని   ఆ పార్టీ నేతలకు తెలిసిపోయిందన్నారు. అందుకే  ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర చేస్తున్నారన్నారు. ప్రతి విషయాన్ని వాడుకుని రాజకీయాలకు మలినం చేసిన చరిత్ర  బీజేపీదేనన్నారు. బీజేపీలో ఉంది చేరికల కమిటీ కాదు, పార్టీల చీలికల కమిటీ అని  ఆయన సెటైర్లు వేశారు. 

ALso REad: ఎమ్మెల్యేల కొనుగోలు‌కు బీజేపీ కుట్ర: దుబ్బాకలో హరీష్ రావు

కేంద్రంలో  అధికారంలోకి రాగానే  తెలంగాణలోని ఏడు మండలాలను లాక్కొన్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్, పెట్రో ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని దుయ్యబట్టారు. ప్రజల ఆదాయం రెట్టింపు చేస్తామని  ఇచ్చిన హామీని  బీజేపీ నిలుపుకోలేదన్నారు. ప్రజలు రోజు ఉపయోగించే వస్తువుల ధరలను విపరీతంగా పెంచారని  ఆయన మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. లాభాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్ని  కేంద్ర ప్రభుత్వం కారుచౌకగా  విక్రయిస్తుందన్నారు. తెలంగాణ రాస్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు  బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయా అని హరీశ్ ప్రశ్నించారు. ప్రజలకు  సంక్షేమ పథకాలు అమలు చేయడం కేసీఆర్ వంతైతే, ధరలు పెంచి ప్రజల నడ్డి విరడం బీజేపీ నైజమన్నారు. దుబ్బాకలో  డయాలసిస్  సేవలను ప్రారంభించనున్నట్టుగా  హరీష్ రావు  చెప్పారు.
 

click me!