
Medical Student Preethi : తెలంగాణలో మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్తాయిలో విచారణ చేపడుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేయడం బాధకరమని అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిని ఎవ్వర్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి తేల్చి చెప్పారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించామని, ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. బాధిత (ప్రీతి) కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రీతి తల్లిదండ్రులతో మంత్రి హరీశ్‌రావు మాట్లాడి ధైర్యం చెప్పారు. నిమ్స్ వైద్యులతో గంట గంటకు మాట్లాడుతూ.. ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
అలాగే.. ఈ ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. నిమ్స్ ఆసుపత్రికి గవర్నర్ వెళ్లిన ప్రీతి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఒక డాక్టర్ గా తాను ప్రీతి కండీషన్ ను అర్థం చేసుకోగలనని అన్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. అయితే..ప్రీతికి వైద్య సదుపాయాన్ని నిమ్స్ డాక్టర్లు అందిస్తున్నారని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం అని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు.
ఈ కేసులో విచారణ వేగవంతమైంది. ప్రీతికి ఐదుగురు డాక్టర్ల బృందం అందించిన వైద్య నివేదికను ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు . ఘటన విచారణ కోసం.. ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీని నియమించారు. అయితే.. ప్రీతికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టునే ప్రామాణికంగా తీసుకుంటామని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.