కరోనా వైరస్.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బు వృథా చేసుకోవద్దు, ఇలా చేయండి: ప్రజలకు హరీశ్ రావు సూచనలు

By Siva KodatiFirst Published Jan 18, 2022, 5:08 PM IST
Highlights

కరోనా ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 3 వారాలు అత్యంత కీలకమన్నారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు. అందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ఏఎన్‌ఎం సబ్‌సెంటర్‌, పీహెచ్‌సీ, ప్రభుత్వ దవాఖానాకు ఎక్కడికి వెళ్లినా కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.

కరోనా ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 3 వారాలు అత్యంత కీలకమన్నారు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు. నారాయణపేట జిల్లా కోయిల్‌కొండలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. ఏఎన్‌ఎం సబ్‌సెంటర్‌, పీహెచ్‌సీ, ప్రభుత్వ దవాఖానాకు ఎక్కడికి వెళ్లినా కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.

ఎంతమందికి కరోనా వచ్చినా మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్ల కొవిడ్‌ టెస్టింగ్ ఎక్విప్‌మెంట్‌ సిద్ధంగా ఉందని,  కోటి మందికి సరిపడా హోం ఐసోలేషన్‌ కిట్లు అందుబాటులో ఉంచామని మంత్రి వెల్లడించారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని.. వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకుని మందులను వారం రోజుల పాటు వాడితే తగ్గిపోతుందని హరీశ్ రావు భరోనా ఇచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు 100 శాతం వ్యాక్సిన్‌ అందించే విధంగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో నారాయణపేటకు డయాలసిస్‌ కేంద్రం మంజూరు చేస్తామని.. అలాగే రూ.66 కోట్లతో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. 

మరోవైపు కరోనా థర్డ్ వేవ్ (corona third wave) విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్ (corona vaccination) ను మరింత వేగవంతం చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (harish rao) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు పలు సలహాలు, సూచనలిస్తూ కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ (mansukh mandaviya)కు హరీష్ లేఖ రాసారు.  

ఇప్పటికే కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరముందని కేంద్ర మంత్రికి హరీష్ సూచించారు. దేశవ్యాప్తంగా అత్యధిక శాతం ప్రజలు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలని హరీష్ డిమాండ్ చేసారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలని హరీష్ సూచించారు. 

ఇక 60ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్ తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలని సూచించారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నామని...  వీటిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు.   

click me!