రైతుబంధు ఆపమంటారా .. ఇదేమైనా కొత్త పథకమా , కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

By Siva Kodati  |  First Published Oct 26, 2023, 4:00 PM IST

రైతుబంధు కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు . రైతు బంధు పథకం కొత్తది కాదని.. ఇప్పటి వరకు తెలంగాణలో 11 సార్లు రైతులకు అందించామని మంత్రి తెలిపారు.


రైతుబంధు కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి హరీశ్ రావు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత కరెంట్ ‌ను.. కాంగ్రెస్ ఉత్త కరెంట్‌గా చేసిందన్నారు. అన్నదాతలపై కాంగ్రెస్‌కు కనికరం లేదని.. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వమని హరీశ్ రావు దుయ్యబట్టారు. కర్ణాటకలో రైతులకు కేవలం 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 61 లక్షల మంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేస్తారని జోస్యం చెప్పారు. 

రైతు బంధు పథకం కొత్తది కాదని.. ఇప్పటి వరకు తెలంగాణలో 11 సార్లు రైతులకు అందించామని మంత్రి తెలిపారు. 12వ సారి కూడా ఇవ్వబోతుంటే కాంగ్రెస్ ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేసిందని ఆయన మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర సమయంలోనూ రైతులకు రైతుబంధు ఇచ్చామని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాం రాం చెబుతారని హరీశ్ పేర్కొన్నారు. రైతుబంధును నిలిపివేయాలని ఈసీని ఎలా కోరతారని ఆయన ప్రశ్నించారు. రైతులకు రైతుబంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మూడు గంటలే కరెంట్ ఇస్తామని స్వయంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారని ఆయన చురకలంటించారు. 

Latest Videos

undefined

ALso Read: నా దమ్మేందో దేశం చూసింది: కొడంగల్ లో పోటీ చేయాలన్న రేవంత్ సవాల్ పై కేసీఆర్ కౌంటర్

డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని హరీశ్ రావు జోస్యం చెప్పారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే .. కేసీఆర్ మాత్రం అన్నదాతలకు డబ్బులు పంచారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు, కేసీఆర్ కిట్ కూడా ఆపమంటారేమో అనిపిస్తోందని.. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హరీశ్‌రావు హెచ్చరించారు. 


 

click me!