కొత్త సూర్యోదయం చూడాల్సిన అవసరం ఉంది.. యుద్దం ఆరంభం అయింది: డీహెచ్ శ్రీనివాస్ రావు

By Sumanth KanukulaFirst Published Mar 26, 2023, 3:55 PM IST
Highlights

తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ (డీహెచ్) శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో అభివృద్ది అనుకున్న స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. 
 

తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ (డీహెచ్) శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాతనగర్ లో జీఎస్ఆర్ ట్రస్ట్ తరఫున ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీనివాసరావు.. కొత్తగూడెంలో అభివృద్ది అనుకున్న స్థాయిలో జరగడం లేదని ఆరోపించారు. కొంత మంది తాము చేస్తున్న మంచి కార్యక్రమాలకు పదే పదే అడ్డు పడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు, అవాంతరాలు సృష్టించిన జీఎస్ఆర్ ట్రస్టు ద్వారా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటానని  చెప్పారు. తాను కొత్తగూడెం బిడ్డనని అని తెలిపారు. 

ఈ జిల్లా కమ్యూనిస్టు జిల్లా అని.. తన వరకు ఇక్కడ పుట్టిన బిడ్డ కమ్యూనిస్టు బిడ్డే.. ఆ తర్వాతే మిగిలిన పార్టీల బిడ్డ అని చెప్పారు. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చిచూసినప్పుడు.. కొత్తగూడెం పరిస్థితి చూస్తే బాధ కలుగుతుందని అన్నారు. సక్రమంగా ప్రణాళికలు చేయలేదని.. చేయాల్సిన వాల్లు చేయలేదని.. అందుకే కొత్తగూడెం నియోజకవర్గం అంతగా అభివృద్ధి చెందలేదని తన భావన అని చెప్పారు. 

కొత్తగూడెం నియోజకవర్గానికి సుజాతనగర్ నుంచే ఎంటర్ కావాల్సి ఉంటుందని అన్నారు. సుజాతనగర్‌ అనేది కొత్తగూడెం నియోజకవర్గానికి సింహాద్వారాం, ముఖ ద్వారమని చెప్పారు. సుజాత నగర్ ప్రజలు ఇచ్చే తీర్పే కొత్తగూడెంలో ఎవరూ కూర్చొవాలో డిసైడ్ చేస్తుందని అన్నారు. కానీ గెలిచిన వాళ్లు ఏం చేస్తున్నారనేది అర్థం చేసుకోవాల్సి ఉందని అన్నారు. గతంలో ఉన్న దృశ్యాలు.. ఇప్పుడు కూడా కనిపించడం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందని అన్నారు. 

‘‘మార్పు అసన్నమైంది.. కొత్తగూడెంకు కొత్త సూర్యోదయం చూడాల్సిన అవసరం ఉంది.. కొత్త కొత్తగూడెంగా నిర్మించుకోవడానికి కొత్త నాయకత్వం అవసరం ఉంది.. ఆ కొత్త నాయకత్వం దారిలో మనం అందరం నడవాల్సిన సమయం అసన్నమైంది. అందుకు సుజాత నగర్ నుంచి అడుగు వేస్తూనే ఉంటాం. మీ ప్రేమతో, ఆశీర్వాదంతోనే. నేను మాట్లాడిన దాంట్లో ఎలాంటి  రాజకీయం లేదు. అంతా సేవే. నాకు ప్రేమ దైవం.. సేవే మార్గం’’ అని  శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. 

మహాభారత యుద్దానికి ముందు పాండవులు అరణ్యవాసం చేశారని.. అన్నిరకాల చర్చల తర్వాతే యుద్ధం మొదలైందని అన్నారు. యుద్దం ఆరంభం అయిందని.. చూసుకుందామని కామెంట్ చేశారు. ‘‘మీ ఆశీర్వదం, అభిమానం ఇలాగే ఉంటే.. మీ బిడ్డగా సేవ కార్యక్రమాలు కొనసాగిస్తాను. ఇక నాకు ఎలాంటి బాధ్యతలు లేవు. కుటుంబపరంగా అన్ని  బాధ్యతలను తీర్చుకున్నాను. ప్రజల కోసం నిర్విరామంగా కష్టపడుతున్న సీఎం కేసీఆర్ నాకు ఆదర్శప్రాయుడు. 1983లో ప్రజల్లో ఎన్‌టీఆర్ చైతన్యం తీసుకొచ్చారు’’ అని చెప్పారు. 

click me!