
దేశంలో బీజేపీ (bjp) శ్రేణులు దెయ్యాలుగా మారాయని.. వాళ్లను రాళ్లతో కొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ (gangula kamalakar). ఆదివారం కరీంనగర్‌లో (karimnagar) హజ్ యాత్రికుల (haj yatra) వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న.. బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు. రాక్షసులను తరిమికొట్టే శక్తి ఇవ్వాలని అల్లాను కోరుకోవాలంటూ సూచించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసే వారి పట్ల సంయమనంతో వుండాలన్నారు. ఒక వ్యక్తి వల్ల ప్రపంచ దేశాల ముందు భారతదేశం తలదించుకునే పరిస్ధితి వచ్చిందని గంగుల అన్నారు.
సర్వ మతాలకు నిలయం భారతదేశమని.. మత రాజకీయాలు చేస్తూ ఇతర మతాలను కించపరిస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. టీఆర్‌ఎస్ ప్రభ్వుత్వం అన్ని మతాలకు సమాన గుర్తింపు ఇస్తుందని గంగుల స్పష్టం చేశారు. అన్ని మతాల పండుగలను వారి సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా నుంచి హాజ్ యాత్రకు వెళ్లే వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందని గంగుల గుర్తుచేశారు.
ALso Read:Nupur Sharma Comment Row : పాక్‌కు అందివచ్చిన అవకాశం... భారత్‌పై దుష్ప్రచారం, 60 వేల ట్వీట్లతో దాడి
కులమతాలకు అతీతంగా అభివృద్ధి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీది ఒక మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని కుటిల మనస్తత్వమని మంత్రి మండిపడ్డారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని గంగుల స్పష్టం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ముస్లిం సోదరులు సహకరించాలని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.