రైతులను ఆదుకున్నది ఎన్టీఆర్, కేసీఆరే: ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 11, 2021, 3:33 PM IST
Highlights

దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను పార్లమెంట్‌లో వ్యతిరేకించామని ఎర్రబెల్లి గుర్తుచేశారు.

తెలుగు నాట రైతులను ఆదుకున్నది ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని అన్నారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆదివారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను పార్లమెంట్‌లో వ్యతిరేకించామని ఎర్రబెల్లి గుర్తుచేశారు.

పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోందంటూ ఎద్దేవా చేశారు. ధాన్యం కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని మంత్రి పేర్కొన్నారు. తెలుగునాట రైతులను ఆదుకున్నది ఇద్దరు మాత్రమేనని.. వారే ఒకరు ఎన్టీఆర్‌.. మరొకరు కేసీఆర్‌ అని ప్రశంసించారు. సీఎం కేసీఆర్‌కు ప్రజలంతా అండగా ఉండాలని .. అభివృద్ధి కార్యక్రమాలకుగాను సత్తుపల్లిలో ఆరు గ్రామాలకు రూ. 20 లక్షలు చొప్పున మంజూరు చేయనున్నట్లు దయాకర్ రావు తెలిపారు.  

Also Read:మహిళా ఎంపీడివోపై అసభ్యకర వ్యాఖ్యలు: రేఖా శర్మాజీకి ఫిర్యాదు

ఇదే సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. రాజశేఖర రెడ్డి ఆనాడు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టాడు.. నేడు ఆయన కొడుకు కూడా అదే పని చేస్తున్నాడని ఆరోపించారు. కృష్ణా జలాలు దోచుకుంటున్న దొంగని దొంగ అనే అంటామని.. జగన్‌కు భయపడే ప్రసక్తే లేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతామన్న ఆయన..  ఇప్పటికే కేంద్రానికి మా అభ్యంతరం తెలియజేశామని మంత్రి వెల్లడించారు.

అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని.. మీ ఇష్టం వచ్చినట్టు శ్రీశైలం దగ్గర బొక్క కొట్టి కృష్ణా జలాలు దోచుకుంటుంటే ఊరుకునే ప్రశక్తేలేదని అజయ్ కుమార్ స్పష్టం చేశారు. తామేం గాజులు తొడుక్కుని కూర్చోలేదని..  తెలంగాణ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు కోసం ఎంతదూరమైనా వెళతామని, ఎవరితోనైనా కొట్లాడతామని అజయ్ కుమార్ అన్నారు. తమ హక్కుల కోసం మా వాటా కోసం అవసరమైతే దేవునితో అయినా కొట్లాడతామని కేటీఆర్ చెప్పిన విషయం మర్చిపోవద్దు అని పువ్వాడ హెచ్చరించారు.   
 

click me!