పాట బతికున్నంత కాలం గద్దర్ కూడా బతికే వుంటారు..: మంత్రి ఎర్రబెల్లి (వీడియో)

By Arun Kumar P  |  First Published Aug 7, 2023, 12:44 PM IST

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం వుంచిన గద్దర్ పార్థీవదేహానికి మంత్రులు ఎర్రబెల్లి, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు నివాళి అర్పించారు. 


హైదరాబాద్ : ప్రజాయుద్దనౌక గద్దర్ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం వుంచిన గద్దర్ పార్థీవదేహాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు సందర్శించి పుష్ఫాజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రులు గద్దర్ కుటుంబసభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.  

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... తన పాటలతో ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసిన గద్దర్ లేనిలోటు ఎవరూ తీర్చలేనిదని అన్నారు. తన జీవితం మొత్తాన్ని ప్రజలకోసమే దారపోసిన గొప్పవ్యక్తి గద్దర్ అని అన్నారు. బుర్రకథ కళాకారుడిగా ప్రారంభమైన గద్దర్ కళా జీవితం, విప్లవ ఉద్యమాలతో మమేకమయ్యిందన్నారు. ఇక తెలంగాణ ఉద్యమంతో గద్దర్ విప్లవోద్యమం అత్యున్నత స్థాయికి చేరిందని అన్నారు. పాట బతికి ఉన్నంతకాలం గద్దర్ కూడా బతికే ఉంటారని ఎర్రబల్లి అన్నారు. 

Latest Videos

వీడియో

ఇక మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గద్దర్ కు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రజల కోసమే గద్దర్ విప్లవోద్యమాల బాటపట్టారని అన్నారు. ఆయన బౌతికంగా మనకు దూరమైన పాటరూపంలో బతికే వుంటారని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 

 ప్రజా గాయకుడు గద్దర్‌ పార్థివ దేహానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళులు.. (ఫొటోలు)

బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కూడా గద్దర్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ''ఒక శకం ముగిసింది..ఒక వీరుడు అస్తమించిండు.. పేదవాడి గుండె చప్పుడు ఆగిపోయింది... పీడిత తాడిత ప్రజాగళం మూగపోయింది... మన గద్దరన్న ఇక లేరు'' అని అన్నారు. గద్దరన్న గొంగడి భుజాన వేసి, కాలికి గజ్జ కట్టి, చేతిలో కర్ర పట్టుకొని పాట పాడుతుంటే, ఆడుతుంటే రగిలిన చైతన్య జ్వాలలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని శ్రవణ్ అన్నారు. 


 

click me!