బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని హైద్రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. హైద్రాబాద్ లో గొడవలు సృష్టించేందుకే రాజాసింగ్ ఈ వీడియోను అప్ లోడ్ చేశారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.
హైదరాబాద్:హైద్రాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే ఉద్దేశ్యంతోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోషల్ మీడియాలో వీడియోను అప్ లోడ్ చేశారని హైద్రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. సెక్షన్ 41 సీఆర్‌పీసీ కింద నోటిస్ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్‌కు బెయిల్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేసి వీడియో శాంపిల్ తీసుకోవాలని ఆయన కోరారు.
also read:డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులతో కేసీఆర్ భేటీ: శాంతి భద్రతలపై చర్చ
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు ఉండడంతో హైద్రాబాద్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ వ్యాఖ్యలు మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉన్నాయని ఎంఐఎం సోమవారం నాడు రాత్రి నుండి మంగళవారం నాడు ఉదయం వరకు ఆందోళనకు దిగింది. హైద్రాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో రాజాసింగ్ పై ఫిర్యాదులు అందాయి, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు బెయల్ మంజూరు చేసింది. రాజాసింగ్ కు బెయిల్ రావడంతో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైద్రాబాద్ నగరంలో ఎలాంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. మరో వైపు ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో డీజీపీ మహేందర్ రెడ్డి సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.