రాజాసింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా.. ఆ మాట అనిపించింది బీజేపీనే.. : మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపణలు

By Mahesh KFirst Published Aug 24, 2022, 5:12 PM IST
Highlights

రాజాసింగ్ సస్పెన్షన్ బీజేపీ ఆడిన ఒక డ్రామా అని, అసలు ఆయనతో ప్రకటన చేయించిందే బీజేపీ అని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. దాన్ని కప్పిపుచ్చడానికే సస్పెన్షన్ డ్రామా తెరమీదకు తెచ్చిందని ఆరోపణలు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి బుధవారం బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో రెచ్చగొట్టుడు ధోరణితో బీజేపీ బలపరుచుకోవాలని ప్రయత్నిస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కల్వకుంట కవిత ఇంటిపై దాడికి బీజేపీ పూనుకున్నదని ఆరోపించారు. అంతేకాదు, రాజాసింగ్‌తో ఆ ప్రకటన చేయించింది బీజేపీనే అని పేర్కొన్నారు. ఆయనపై సస్పెన్షన్ వేటు ఒక డ్రామా అని విమర్శించారు. రెచ్చగొట్టి లబ్ది పొందాలనేదే ఆ పార్టీ వ్యూహం అని తెలిపారు. తెలంగాణ ప్రజలు వీటిని జాగ్రత్తగా గమనించాలని కోరారు.

సీఎం కేసీఆర్ కుమార్తె అని తెలిసి... మాజీ ఎంపీ అని తెలిసి.. ఎమ్మెల్సీ అని తెలిసి మరీ కవిత ఇంటిపై ఈ తరహా దాడికి పాల్పడిందని ఆయన అన్నారు. బుధవారం ఆయన సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణపై ఇక్కడి బీజేపీ సంఘ్ పరివార్ ఈ దాడులకు దిగడం అంటే.. తెలంగాణలో అలజడి సృష్టించడానికి కేంద్రం కుట్రలు పన్నుతున్నదనే విషయం స్పష్టం అయిందని తెలిపారు. కావాలనే కేంద్రం ఎంపీతో ఆ మాటలు అనిపించిందని పేర్కొన్నారు.

రాష్ట్రం అవతరించి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే ఎనిమిదేళ్లుగా శాంతి భద్రతల విషయంలో తెలంగాణ యావత్ దేశానికే రోల్ మోడల్‌గా ఉన్నదని మంత్రి తెలిపారు. కానీ, బీజేపీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్పించి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నదని అన్నారు. టీఆర్ఎస్ క్యాడర్‌ను రెచ్చగొట్టి ప్రతీకార దాడులు జరిపించుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. కానీ, కేసీఆర్‌ది, టీఆర్ఎస్‌ది అలాంటి ఆలోచనలు కావాని అన్నారు. బీజేపీ లీడర్, క్యాడర్‌ను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చని, టీఆర్ఎస్ క్యాడరే తిరగబడితే రాష్ట్రంలో బీజేపీ ఉంటుందా? అని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ బీజేపీ ఆడిన ఓ డ్రామా అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాజాసింగ్‌తో ప్రకటన చేయించింది బీజేపీయేనని అన్నారు. దాన్ని కప్పి పుచ్చుకోవడానికే సస్పెన్షన్ డ్రామా తెర మీదకు తెచ్చిందని ఆరోపణలు చేశారు.

click me!