నిన్న చేవేళ్లలో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు.
హైదరాబాద్: తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. నిన్న చేవేళ్ల సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. అమిత్ షా ప్రసంగంలో విద్వేషం మాత్రమే కన్పించిందన్నారు. తెలంగాణలో గణాంకాల ఆధారంగానే మైనార్టీ కోటా అమలౌతుందని ఓవైసీ స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేయాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
తెలంగాణలో మైనార్టీ కోటాకు మతం ప్రాతిపదిక కాదన్నారు. రిజర్వేషన్ల అమలులో 50 శాతం కోటా క్యాప్ ను తొలగించాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. మైనార్టీలు టార్గెట్ గా బీజేపీరాజకీయం చేస్తుందని ఓవైసీ విమర్శించారు. నరేంద్ర మోడీ కేబినెట్ లో ఉన్నత కులాలకు చెందినవారే అధికంగా ఉన్నారని ఆయన విమర్శించారు. ఓబీసీలకు అధిక ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. కులగణన లెక్కలు బయటపెట్టడానికి భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.