అవును నా తల్లి బీసీ, నా తండ్రి ఎస్‌సీయే: రాజయ్య వ్యాఖ్యలపై కడియం ఫైర్

By narsimha lode  |  First Published Jul 10, 2023, 5:02 PM IST

తన కులం,  తన తల్లిని గురించి  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  తాటికొండ రాజయ్య  చేసిన వ్యాఖ్యలు  మనోవేదనకు గురి చేశాయన్నారు.  ఈ వ్యాఖ్యలకు  క్షమాపణలు చెప్పాలన్నారు.


వరంగల్: తన తల్లి బీసీ,  తన తండ్రి ఎస్‌సీ సామాజిక వర్గానికి చెందినట్టుగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. తన కులం గురించి  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  తాటికొండ రాజయ్య  చేసిన వ్యాఖ్యలపై  ఆయన మండిపడ్డారు.  ఈ వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయన్నారు.

సోమవారంనాడు స్టేషన్ ఘన్ పూర్ లో  కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు.  పార్టీ ఆదేశాల ప్రకారంగా 2014, 2018లలో  రాజయ్య గెలుపు కోసం తాను , తన వర్గం మొత్తం పనిచేసిందని  కడియం శ్రీహరి చెప్పారు. కానీ ఇటీవల తన  కులం గురించి  రాజయ్య  ఇష్టారీతిలో మాట్లాడడం  మనోవేదనకు గురి చేసిందన్నారు.  తండ్రి కులమే పిల్లలకు వర్తిస్తుందన్నారు.ఈ విషయం చట్టం, సుప్రీంకోర్టు తీర్పులున్న విషయం రాజయ్యకు తెలియదా అని ఆయన  ప్రశ్నించారు.  తండ్రి కులమే  వారసులకు వస్తుందనే విషయం  రాజయ్యకు తెలియదా అని ఆయన అడిగారు. 

Latest Videos

undefined

తల్లి అనేది సత్యం, తండ్రి అనేది అపోహా అంటూ తన తల్లి గురించి  రాజయ్య  అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని  శ్రీహరి  గుర్తు  చేశారు.  తన తల్లి సత్యం, తండ్రి అపోహా అయితే  అదే సూత్రం రాజయ్యకు కూడ వర్తిస్తుంది కదా అని అభిప్రాయపడ్డారు.   సమాజంలోని ప్రతి ఒక్కరి పుట్టుకను ప్రశ్నించేలా  రాజయ్య వ్యాఖ్యలున్నాయన్నారు. సమాజంలోని ప్రతి తల్లిని అనుమానించేలా  రాజయ్య వ్యాఖ్యలున్నాయన్నారు. భారత దేశ కుటుంబ వ్యవస్థను అవమానించేలా  ఎమ్మెల్యే వ్యాఖ్యలున్నాయన్నారు.  భేషరతుగా మహిళలకు  ఎమ్మెల్యే  రాజయ్య క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ముక్కు నేలకు  రాసి మహిళలకు  క్షమాపణలు చెప్పాలని కడియం శ్రీహరి  ఎమ్మెల్యే  రాజయ్యను కోరారు.  ఈ రకంగా  మాట్లాడేవారిని ఎక్కడైనా చూశామని అని ఆయన ప్రశ్నించారు.  కుటుంబాలను, తల్లులను అవమానించే ప్రజా ప్రతినిధులను ఎప్పుడైనా  చూశారా అని  ఆయన ప్రశ్నించారు.  

తాను మంత్రిగా ఉన్న  సమయంలో  ఎన్ కౌంటర్లు  ఎక్కువగా జరిగాయని, ఎన్ కౌంటర్ల సృష్టికర్త అంటూ  రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం శ్రీహరి మండిపడ్డారు.  తాను మంత్రిగా  పనిచేయక ముందు, ఆ తర్వాత కూడ రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు జరిగాయన్నారు.  వాస్తవానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఎక్కువగా ఎన్ కౌంటర్లు జరిగాయని  కడియం  శ్రీహరి గుర్తు  చేశారు.  2004 నుండి  20012 వరకు   రాజయ్య  కాంగ్రెస్ లోనే ఉన్నారన్నారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో  జరిగిన ఎన్ కౌంటర్లకు  రాజయ్య  బాధ్యత వహిస్తే  తాను  మంత్రిగా ఉన్న సమయంలో  కూడ  ఎన్ కౌంటర్లకు బాధ్యత వహిస్తానన్నారు.  బాధ్యతరహితమైన  ప్రకటనలను మానుకోవాలని కడియం శ్రీహరి  రాజయ్యకు సూచించారు. 

తనకు విదేశాల్లో  ఆస్తులున్నాయని  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే  రాజయ్య  ఆరోపించారన్నారు.  వారం రోజుల్లో ఈ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకువస్తే వాటిని  స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ దళితులకు రాసిస్తానని చెప్పారు. ఒకవేళ  ఈ ఆస్తులకు సంబంధించి   ఆధారాలు చూపించకపోతే   క్షమాపణ చెప్పాలని  ఆయన డిమాండ్  చేశారు.   స్టేషన్ ఘన్ పూర్ లో  అభివృద్ధి  చేయలేదని  రాజయ్య  చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.  ఈ నియోజకవర్గంలో  ఏ గ్రామంలో ఏం అభివృద్ధి  చేశామో  చెప్పేందుకు తాను సిద్దంగా ఉన్నట్టుగా కడియం శ్రీహరి చెప్పారు.
 

click me!