నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. అద్దంకి, నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ కారు నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది.
Road Accident: రెండు కుటుంబాలు ఒకే కారులో దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యాయి. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరే సందర్భంలో వెనుక నుంచి ఓ లారీ మృత్యురూపంలో దూసుకువచ్చింది. కారును వెనుక నుంచి ఢీకొట్టి పోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. ఒక మహిళ తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా మిర్యాలగూడ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
స్థానికులు అందించిన వివరాల ప్రకారం, మిర్యాలగూడలోని నందిపాడు కాలనీకి చెందిన చెరుపల్లి మహేశ్(32), ఆయన భార్య జ్యోతి (30), వీరి కుమార్తె రిషిత (6)లతోపాటు మహేశ్ తోడల్లుడు, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు చెందిన భూమా మహేందర్ (32), ఆయన భార్య మాధవీ, వీరి కుమారుడు లియాన్సీ (2)లు కారులో ప్రయాణిస్తున్నారు. వీరంతా ఏపీలోని విజయవాడ, ఇతర ప్రాంతాల్లోని దైవ దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. నందిపాడు కాలనీకి వస్తుండగా.. అద్దంకి నార్కట్ పల్లి ప్రధాన రహదారిపై ఆ కారును వెనుక నుంచి గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది.
Also Read: YSRCP: వైసీపీ ఐదో జాబితాపై తీవ్ర కసరత్తు.. మరో రెండు రోజుల్లో జాబితా ప్రకటన!
మరో నాలుగు ఐదు నిమిషాలైతే ఆ కుటుంబం సురక్షితంగా ఇంట్లో దిగేదే. కానీ, ఇంతలోనే లారీ ఢీకొట్టింది. దీంతో మహేశ్, జ్యోతి, రిషిత, భూమా మహేందర్, లియాన్సీలు అక్కడికక్కడే మరణించారు. మాధవి గాయాలతో బయటపడింది. మిర్యాలగూడ ప్రాంతీయ హాస్పిటల్‌లో ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. ఆ తర్వాత ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ లారీ ఆచూకీ కోసం వెతుకుతున్నట్టు సమాచారం.