భవిష్యత్తులో మరో కోటి మంది జనాభా అవసరాలకు అనుగుణంగా మెట్రోరైలు విస్తరణ పనులు చేపట్టనున్నట్టుగా హైద్రాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు
హైదరాబాద్:భవిష్యత్తులో ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నామని హైద్రాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. హైద్రాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మంగళవారంనాడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ లో కోటి20లక్షల మంది జనాభా ఉన్నారన్నారు.రానున్న రోజుల్లో మరో కోటి మంది హైద్రాబాద్ లో నివసించే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. వీరందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెట్రో రైలు విస్తరణ పనులు చేయనున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. తుక్కుగూడ, బొంగ్లూరు, పెద్దఅంబర్ పేట వరకు 40 కి.మీ మెట్రో కారిడార్ ను విస్తరించనున్నట్టుగా హైద్రాబాద్ మెట్రో రైలు ఎండీ వివరించారు.
మరో వైపు పెద్ద అంబర్ పేట, ఘట్ కేసర్, శామీర్ పేట, మేడ్చల్ రూట్ లో 45 కి.మీ. దూరం మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. మేడ్చల్ నుండి పటాన్ చెరు వరకు 29 కి.మీ మెట్రో కారిడార్ ను పనులు చేపట్టాలని భావిస్తున్నట్టుగా ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు నుండి నార్సింగి వరకు 22 కి.మీ మెట్రో కారిడార్ పనులు చేపడుతామన్నారు. తార్నాక నుండి ఈసీఐఎల్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ ను విస్తరించనున్నట్టుగా చెప్పారు.శంషాబాద్ నుండి షాద్ నగర్ వరకు మెట్రోరైలు కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్ నుండి బీబీనగర్ వరకు 25 కి.మీ మెట్రో రైలు నిర్మాణం చేస్తామని ఎన్ వీ ఎస్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ప్యాట్నీ నుండి కండ్లకోయ వరకు మెట్రో విస్తరిస్తామన్నారు.
ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్టు కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత తయారయ్యే డీపీఆర్ ప్రకారం ఎక్కడ ఏ స్టేషన్ ఏర్పాటు కానుందో తేలనుందన్నారు. డీపీఆర్ ఆధారంగానే మెట్రో రైలు విస్తరణ పనులకు ఎంత ఖర్చు కానుందో మరింత కచ్చితమైన సమాచారం రానుందని మెట్రోరైలు ఎండీ అభిప్రాయపడ్డారు. మెట్రో రైలు విస్తరణ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
ప్రపంచంలో హైద్రాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.ఈ క్రమంలోనే మెట్రో రైలు విస్తరణ చేయాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు.ముంబైలో రూ. 1లక్ష కోట్లు, కర్ణాటక ప్రభుత్వం రూ. 60 లక్షల కోట్లు, తమిళనాడు ప్రభుత్వం రూ.60 లక్షల కోట్లు, తెలంగాణ ప్రభుత్వం రూ. 60 లక్షల కోట్లను ఖర్చు చేయనుందని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.