భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు: ఆర్టీసీ విలీనంపై గతంలో కేసీఆర్.. వీడియో వైరల్

Published : Aug 01, 2023, 03:56 PM IST
భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు: ఆర్టీసీ విలీనంపై గతంలో కేసీఆర్.. వీడియో వైరల్

సారాంశం

టీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు వారిని ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

టీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన సమస్యలపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించి కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీర్మానం చేసిందన్నారు. టీఎస్‌ఆర్టీసీని కాపాడేందుకు, రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ చర్య తీసుకోబడిందని అన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధ్యయనం చేసి, తదనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించడానికి అధికారులతో కూడిన సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సమ్మె కూడా చేయడం జరిగిందని  గుర్తుచేశారు. ఇక, టీఎస్‌ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 43,373 మంది ఉద్యోగులు విలీన ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వ సిబ్బంది కానున్నారు. 

అయితే ఆర్టీసీ విలీనానికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీఎస్‌ఆర్టీసీకి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందులో ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం అని కేసీఆర్ అన్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇవి. దీంతో అప్పుడు కేసీఆర్ అన్న మాటలను.. ఇప్పుడు కేటీఆర్ అన్న మాటలను పోల్చుతూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్టు చేస్తున్నారు. అప్పుడు అసంభవం అన్నది ఇప్పుడు ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకే కేసీఆర్ సర్కార్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. వీఆర్ఏ‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయడం.. వంటి నిర్ణయాలు ఓట్ల కోసమేనని ఆరోపణలు  చేస్తున్నారు. 

అసలు ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో కేసీఆర్ ఏమన్నారంటే.. ‘‘ఎవరూ పడితే వాళ్లు వచ్చి మమల్ని ప్రభుత్వంలో కలపమంటే.. కలుపుతారా?. అంత ఈజీగా అయితదా?. రాష్ట్ర ప్రభుత్వానికి 57 కార్పొరేషన్‌లు ఉన్నాయి. అందరూ అదే దారి పడితే ఏం చెప్పాలి. రోడ్ల మీద పడి ఇష్టమున్నట్టుగా మాట్లాడటమేనా?. గవర్నమెంట్‌కు పనిచేసే విధానం ఉంటుంది. ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలిపితే.. మిగిలిన కార్పొరేషన్‌లను ఎందుకు కలపలేదని కోర్టులు ఆర్డర్ ఇస్తాయి. అప్పుడేం  సమాధానం చెప్పాలె. ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడం అనేది అసంబద్దమైనది. అసంభవం. అర్ధరహితమైనది. 

అదో తెలివితక్కువ నినాదం.. పిచ్చి రాజకీయ పార్టీలు, తలకాయ మాసిపోయినోళ్లు గిళ్లు చేస్తున్నారు. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి కదా?. దీనిని రాజకీయం  అని అంటారా?. బాధ్యత కలిగిన ప్రతిపక్షాలు చేయాల్సిన పనేనా?. అరాచక వ్యవస్థను ప్రోత్సహిస్తారా? 4 ఏళ్లలో 57 శాతం శాలరీ హైక్ ఇచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులది ఇదేమి కోరిక?. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదు. పశ్చిమ బెంగాల్‌లో ఆర్టీసీని ఎవరూ మూశారు?

ఇది 100 పర్సెంట్ అసంభవం.. గవర్నమెంట్‌లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు. ఏపీలో చేస్తున్నారు కదా? చూద్దాం కదా? ఏపీలో ఏం జరిగిందో.. అక్కడొక ప్రయోగం చేశారు. అక్కడ ఏమీ మన్ను కూడా జరగలేదు. కమిటీ వేశారంట.. మూడు నెలలకో, ఆరు నెలలకో ఏదో చెప్తారంట కథ. అది ఏం చెబుతారనేది తెలియదు. సీఎం జగన్ సంగతే చెబుతున్నా? మైకులోనే చెబుతున్నా? దాచుకోవడం ఎందుకు?.

 

సో కాల్డ్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు కదా.. వారు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా ఆర్టీసీని విలీనం చేశారా? మరి అక్కడ ఎందుకు చేయలేదు? ఇక్కడ మాట్లాడే బీజేపీ పవిత్రమైనదేనయే.. మరి బీజేపీ రూలింగ్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదు’’ అని ప్రశ్నించారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?