
జగిత్యాల: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల (paddy procurement) విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో రాష్ట్ర టీఆర్ఎస్ సర్కార్ (trs government) అమీతుమీకి సిద్దమయ్యింది. దీంతో రాష్ట్ర వాడీవేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని... ఇందుకు నిరసనగా రాష్ట్రంలోనే కాదు దేశ రాజదాని న్యూడిల్లీలో ఆందోళనలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇలా కేంద్రంతో ప్రత్యక్ష పోరుకు సిద్దమవుతున్న కీలక సమయంలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగుతున్నాయి.
ఇంతకాలం ఇతర పార్టీలోంచి అధికార పార్టీలోకి వలసలు కొనసాగగా ఇప్పుడు టీఆర్ఎస్ నుండి ఇతరపార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు టీఆర్ఎస్ ను వీడగా ఇంకా చాలామంది టీఆర్ఎస్ ను వీడటానికి సిద్దంగా వున్నట్లు బిజెపి నాయకులు చెబుతున్నారు. వారు అంటున్నట్లుగానే ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ బిజెపిలో చేరగా తాజాగా జగిత్యాల జిల్లాలో ఓ జడ్పిటిసి టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
video
కోరుట్ల నియోజకవర్గం మెట్ పల్లి జడ్పిటిసి కాటిపళ్లి రాధ, శ్రీనివాస్ రెడ్డి దంపతులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అవసరం అయితే టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన జడ్పిటిసి పదవిని కూడా వదులుకోవడానికి సిద్దమేనని జడ్పిటిసి భర్త ప్రకటించారు. రాజీనామా విషయంలో వెనక్కితగ్గేదే లేదని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు.
ఈ సందర్భంగా తాము టీఆర్ఎస్ ను వీడటానికి దారితీసిన పరిస్థితులను శ్రీనివాస్ రెడ్డి వివరించారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయకపోవడంతో పాటు ముత్యంపేటలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయిస్తామన్న హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని... ఇందుకోసమే తాము పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
రైతుల సమస్యలను కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్లామని... అయినా ఏమాత్రం స్పందన లేదని అన్నారు. ఇలా ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చలేని పార్టీలో వుండకూడదని నిర్ణయించుకున్నట్లు... ప్రజలు నిలదీయడానికంటే ముందు తానే రాజీనామా చేస్తున్నట్లు జడ్పిటిసి భర్త వెల్లడించారు.
రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లే జడ్పిటిసి పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్దమని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తమ రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా సీఎం కేసీఆర్ కు పంపామని తెలిపారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని... రైతులను న్యాయం జరిగేలా చూడటం గురించే ఆలోచిస్తున్నామని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇక ఇటీవల టీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రకటించి, నిన్న(మంగళవారం) ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ ఇంట్లో జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో భిక్షమయ్య గౌడ్ తో పాటు ఆయన అనుచరులకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఇతర నేతలు పాల్గొన్నారు. ఆలేరు ప్రజలకు సేవచేసేందుకే బీజేపీలో చేరినట్టుగా భిక్షమయ్య గౌడ్ చెప్పారు.