మీరు మేడారం జాతరకు వెళ్లలేకపోతున్నారా..? సమ్మక్క సారలమ్మలను దర్శించుకోలేకపోతున్నారా? అయితే మీలాంటి భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని ఇంటివద్దే పొందే ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్ : రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమయ్యింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా రికార్డులు నమోదయ్యాయంటేనే మేడారంకు భక్తులు ఏ స్థాయిలో వస్తారో అర్థమవుతుంది. తెలంగాణ కుంభమేళగా పిలుచుకునే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలనుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తుతారు. ముఖ్యంగా గిరిజనులు, ఆదివాసులు పిల్లా పాపలతో కలిసివచ్చి వనదేవతలు సమ్మక్క-సారలమ్మ లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.
అయితే ఈ నెలలో (ఫిబ్రవరి 21 నుండి 24వరకు) జరిగే ఈ మేడారం జాతరలో పాల్గొనలేకపోతున్న భక్తులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వనదేవతల పూజకు ఉపయోగించిన పసుపు, కుంకుమతో పాటు ప్రసాదాన్ని మన ఇంటికే అందించే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ, ఆర్టిసి సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇవాళ(బుధవారం) అంటే ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 25 వరకు మేడారం ప్రసాదంకోసం ఆఫ్ లైన్, ఆన్ లైన్ లో బుక్ చచేసుకోవచ్చు. జాతర ముగిసిన తర్వాత భక్తుల ఇంటివద్దకే ప్రసాదం రానుంది.
మేడారం ప్రసాదం ఎలా పొందవచ్చంటే :
ఆర్టిసి కార్గో (లాజిస్టిక్) కౌంటర్లలో పనిచేసే సిబ్బంది లేదంటే బస్ డిపోల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సిబ్బందిని మేడారం ప్రసాదం కోసం సంప్రదించవచ్చు. రూ.299 చెల్లించి ప్రసాదాన్ని బుక్ చేసుకోవాలని ఆర్టిసి సూచించింది.
ఇక ఆర్టిసి బస్టాండ్ కు కూడా వెళ్లలేని భక్తులు ఆన్ లైన్ లో కూడా మేడారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. పేటిఎం ఇన్ సైడర్ యాప్ ద్వారా అమ్మవారి ప్రసాదాన్ని బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
నేటినుండి మేడారంలో ఉత్సవాలు :
అడవుల్లో వెలిసిన గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మలను కొలిచే మేడారం జాతరకు నేడు అంకురార్పణ జరగనుంది. జాతరలో మొదటి ఘట్టమైన 'మండుగెలిగె' పండగను గిరిపుత్రులు నిర్వహించనున్నారు. అమ్మవార్లు కొలువైన కన్నెపల్లితో పాటు గోవిందరాజులు, పగిడిద్దరాజు గుడులను పుట్టమన్నుతో శుభ్రంచేని మామిడి తోరణాలతో అలంకరించనున్నారు. గిరిజన బిడ్డలు పూజలు దేవతలకు పూజలు నిర్వహించి డప్పులు, డోలు వాయిద్యాలతో ఉత్సవాలు చేసుకోనున్నారు. ఈరోజు నుండి మేడారం జాతర సందడి నెలకొంటుంది.