
హైదరాబాద్: రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఈ రోజు హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌లో ఎంసీహెచ్(తల్లి, శిశువుల కోసం) బ్లాక్ ప్రారంభించారు. దీనితోపాటు 33 నియోనేటల్ అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. అనంతరం, మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
గాంధీ హాస్పిటల్‌లో సూపర్ స్పెషాలిటీ తరహా 200 పడకలతో ఎంసీహెచ్ బ్లాక్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉన్నదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో మొత్తం 600 పడకలతో ఎంసీహెచ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వివరించారు. ఇందులో భాగంగా తొలిగా గాంధీ హాస్పిటల్‌లో 200 పడకలతో మాతా శిశు కేంద్రాన్ని ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే నిమ్స్‌లోనూ 200 పడకలతో, టిమ్స్‌లోనూ 200 పడకలతో ఎంసీహెచ్ బ్లాక్‌లను ప్రారంభిస్తామని వెల్లడించారు. వీటిలో అత్యున్నత స్థాయి నిపుణుల పర్యవేక్షణలో తల్లికి, శిశువుకు చికిత్స అందుతుందని చెప్పారు. గర్భిణిలు సురక్షితంగా ప్రసవించడానికి సాధ్యమవుతుందని వివరించారు.
మాతా శిశువుల మరణాలను తగ్గించడానికి, వారికి అధునాతన చికిత్సను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతోనే వీటిని నిర్మించినట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. అత్యల్ప తల్లి మరణాలు చోటుచేసుకునే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానికి ఎదిగిందని వివరించారు. తల్లి మరణాలను 93 శాతం నుంచి 42 శాతానికి తగ్గించామని చెప్పారు. అలాగే, పిల్లల మరణాలను గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ప్రసవాల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు.
Also Read: ఖర్గేతో ముగిసిన టీ.కాంగ్రెస్ నేతల భేటీ.. అమలుకానీ హామీలు ఇవ్వొద్దన్న ఏఐసీసీ చీఫ్
శిశువులను మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌లోని ఈ ఎంసీహెచ్ బ్లాక్‌లకు తరలించడానికి కొత్తగా 33 నియోనేటల్ అంబులెన్స్‌లను ప్రారంభించామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ అంబులెన్స్‌లలో శిశువులకు అవసరమైన పరికరాలు, ఏర్పాట్లు ఉంటాయని వివరించారు. వీటిని 33 జిల్లాలకు పంపిస్తామని చెప్పారు. ఏ జిల్లాలోనైనా శిశువును అత్యవసరంగా మరింత నాణ్యమైన చికిత్స అవసరం పడితే.. ఈ అంబులెన్స్‌లలో హైదరాబాద్‌కు తరలించవచ్చునని పేర్కొన్నారు.