
వరంగల్ : వరకట్న వేధింపులకు మరో వివాహిత బలయింది.. అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధించడంతో భూక్యా మౌనిక (28) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం వరంగల్ జిల్లాలోని పకీర్ తండాలో వెలుగు చూసింది. స్థానిక ఎస్సై మంగీలాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భూక్యా వెంకన్న, బుల్లి దంపతుల కొడుకు రాంబాబు. వీరు మానుకోట జిల్లా నరసింహులపేట మండలం పకీరతండాలో ఉంటారు.
రాంబాబుకు 11యేళ్ల క్రితం బయ్యారం మండలం చోక్లాతండాకు చెందిన మౌనికతో వివాహం అయ్యింది, కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత అదనపు కట్నపు వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టడంతో వాటిని తట్టుకోలేని మౌనిక.. తీవ్ర మనస్థాపానికి గురై.. ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మహబూబ్ నగర్ ఏరియా ఆసుపత్రికి మౌనికను తరలించారు.
తెలంగాణ మహిళా బాక్సర్ కు రూ.2 కోట్ల సాయం ప్రకటించిన సీఎం కేసీఆర్
ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గమధ్యంలోనే మౌనిక మృతి చెందింది. మౌనిక, రాంబాబు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మౌనిక మృతికి భర్త, అత్తామామలే కారణమంటూ మౌనిక తండ్రి తేజావత్ హుస్సేన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే మరోవైపు మృతురాలి తలపై బలమైన గాయం ఉందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల తీవ్ర రక్తస్రావం జరిగిందని కూడా చెబుతున్నారు. మౌనికది హత్య అని.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని బంధువులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.