
ప్రపంచ స్థాయిలో కుస్తీ పోటీలలో ఘన విజయాలను సాధిస్తూ.. భారత్ కీర్తిపతాకను రెపరెపలాడిస్తున్న తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం అందించాలని నిర్ణయించింది. నిఖత్ జరీన్ గురువారం రాష్ట్ర సచివాలయంలో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె సాధించిన విజయాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ అభినందించారు. రాబోయే ఒలింపిక్స్ కోసం సన్నద్ధత, మెరుగైన శిక్షణ, సాధన ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఒలింపిక్స్ క్రీడల్లో నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించాలని. తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని చాటాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
ఈ క్రమంలో నిఖత్ జరీన్ కు రూ.2 కోట్ల సాయాన్ని అందిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఒలింపిక్స్ లోనూ నిఖత్ జరీన్ పతకం సాధించాలని, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని తెలిపారు. ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.2 కోట్లు ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
26 ఏళ్ల నిఖత్ జరీన్ 2022, 2023లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ టైటిళ్లను కైవసం చేసుకుంది. అలాగే.. గతేడాది బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ నిఖత్ ను బంగారు పతాకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు నిఖత్ ఒలింపిక్స్ లక్ష్యంగా కృషి చేస్తోంది. ఈ సమావేశంలో క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.