మంజీరా డ్యామ్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ అరెస్ట్, జిల్లాల్లో నేతల గృహ నిర్భంధం

By narsimha lodeFirst Published Jun 4, 2020, 1:35 PM IST
Highlights

 మంజీరా డ్యామ్ పరిశీలన కోసం  వెళ్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు పటాన్‌చెరు టోల్ గేట్ వద్ద గురువారం నాడు అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్: మంజీరా డ్యామ్ పరిశీలన కోసం  వెళ్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు పటాన్‌చెరు టోల్ గేట్ వద్ద గురువారం నాడు అరెస్ట్ చేశారు. 

లాక్ డౌన్ నేపథ్యంలో మంజీరా ప్రాజెక్టు పరిశీలన కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లకుడా పోలీసులు అడ్డుకొంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద కూడ భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం నాడు మధ్యాహ్నం ఔటర్ రింగ్ రోడ్డు మీద నుండి మంజీరా డ్యామ్ పరిశీలనకు బయలు దేరారు. 

మంజీరా డ్యామ్ పరిశీలనకు తాము  వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను పరిశీలించడం తమ హక్కు అని ఆయన ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేల జిల్లా పర్యటనలకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారొద్దని ఉత్తమ్ కోరారు.

ఈ నెల 2వ తేదీన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఇవాళ మంజీరా డ్యామ్ పరిశీలనకు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

పటాన్ చెరు టోల్ గేట్ వద్దకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనం చేరుకోగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డిలను బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.


 

click me!