తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్‌ .. మాణిక్యం పోయే, మాణిక్‌రావు వచ్చే

By Siva KodatiFirst Published Jan 4, 2023, 9:09 PM IST
Highlights

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా మాణిక్‌రావు థాక్రేను హైకమాండ్ నియమించింది. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జ్‌గా వున్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్‌గా పంపింది అధిష్టానం.
 

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగోర్ స్థానంలో కొత్తగా మాణిక్ రావ్ ఠాక్రే‌ను నియమించింది హైకమాండ్. అటు మాణిక్యం ఠాగోర్‌కు గోవా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ పేరిట బుధవారం ప్రకటన విడుదలైంది.  

ఇక మాణిక్‌రావు విషయానికి వస్తే.. మహారాష్ట్రకు చెందిన ఆయన కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా వున్నారు. 1985 నుంచి 2004 వరకు ధార్వా అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుశీల్ కుమార్ షిండే, విలాస్ రావు దేశ్‌ముఖ్, శరద్ పవార్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. అలాగే మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగానూ మాణిక్ రావు విధులు నిర్వర్తించారు. 

అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి మాణిక్యం ఠాగూర్ తప్పుకున్నారు.  ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపారు. కాగా.. గత కొంతకాలంగా ఠాగూర్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. విభేదాలు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్. ఆయన రిపోర్టుతో తెలంగాణకి కొత్త ఇన్‌ఛార్జ్‌ని నియమించాలని హైకమాండ్ నిర్ణయించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తమ మాటకు గాంధీ భవన్‌లో విలువ వుండటం లేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన పలువురు నేతలు ఠాగూర్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ALso Read: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్యం ఠాగూర్

ఇదిలావుండగా.. తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఏర్పడిన వివాదాలకు పరిష్కారం చూపేందుకు, పార్టీని గాడిలో పెట్టే బాధ్యతను హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కు అప్పగించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన తెలంగాణకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారితో చర్చించారు. టీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయని,ఇవి పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. వీరి మధ్య వెంటనే సయోధ్య కుదర్చాల్సిన అవసరం ఉందని, ఇక ఆలస్యం చేయకుండా ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు ఆయన హైకమాండ్ కు నివేదికను అందజేశారు.

click me!