
హైదరాబాద్ కోకాపేట ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డులో దంపతులకు ముప్పు తప్పింది. వారు ప్రయాణిస్తున్న కారు వర్షపు నీరులో చిక్కుకుపోయింది. గంటపాటు దంపతులు కారులోనే ఉండిపోయారు. భార్య గర్భిణీ కావడంతో.. భర్త వెంటనే అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. చివరకు మిత్రుల సహయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాధిత వ్యక్తి ఉదయ్ తేజ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘ఇంజినీరింగ్ బృందం చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల నాకు 40 లక్షలు, మరో ఇద్దరు వ్యక్తులకు చాలా ఎక్కువ ఖర్చు అయింది. మూవీ టవర్స్ దగ్గర ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు వేసిన గొప్ప ఇంజినీరింగ్ టీమ్ చిన్న ప్యారపెట్ గోడకు డ్రైన్ హోల్స్ వేయడం మరిచిపోయింది. దీంతో వర్షపు నీరు నాలాలోకి వెళ్లలేదు
12 బీఎండబ్ల్యూలు, 8 మెర్సిడెస్ కార్లు ఒక వర్షపు రాత్రి నీటిలో నిలిచిపోయాయి. దీని వలన కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఎస్‌ఎన్‌డీపీ అంటే ఇదేనా?. నాలాలను నిర్మించడం చాలా గొప్ప విషయం అయితే నాలాలోకి నీరు వెళ్లకుండా 1 అడుగుల ఎత్తులో గోడను ఏర్పాటు చేయడం ఒక కళాఖండం. పరిష్కారం ఉందా?’’ అని మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు.
అయితే కారు రోడ్డుపై వర్షపు నీరులో చిక్కుకుపోవడంతో.. అతడు తన స్నేహితులను సాయం కోసం పిలిచాడు. వారి సాయంతో తన భార్యను ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్లాడు. అయితే నీటిలో నుంచి తన భార్యను బయటకు తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందని ఉదయ్ తేజ చెప్పారు. నీటిలో చిక్కుకుపోయిన కారును బయటకు తీయడానికి అతడు, కారు డ్రైవర్ ఉదయం వరకు వేచి చూడాల్సి వచ్చింది.