
హైదరాబాద్ : తెలంగాణరాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణమైన ఘటన వెలుగు చూసింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. ఆమె మార్చి ఒకటో తేదీన కళ్యాణ్ నగర్ లో ఉండే బంధువుల ఇంటికి తల్లితో కలిసి వెళ్ళింది. అక్కడ బంధువులు 27 ఏళ్ల సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని సూచించారు. అయితే దీనికి బాలిక ఒప్పుకోలేదు.
అది సతీష్ కు నచ్చలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బాలికను బలవంతంగా గదిలోకి తీసుకువెళ్లి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అలా ఆమె మీద అనేకసార్లు అత్యాచారం చేశాడు. ఇటీవల మూసాపేట ప్రాంతంలో ఉండే బాలిక అమ్మమ్మ అనారోగ్యంతో ఉండడంతో చూడడానికి వచ్చారు. ఈ సమయంలో బాలిక ముభావంగా ఉండడం, ఏదో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లుగా గమనించిన అమ్మమ్మ.. ఆమెను ఏం జరిగిందని ఆరా తీసింది.
దీంతో బాలిక విషయం మొత్తం అమ్మమ్మకు చెప్పి బావురుమంది. విషయం విన్న అమ్మమ్మ మొదట షాక్ అయ్యింది. ఆ వెంటనే బాలికను తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్లింది. శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. సదరు నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆర్టీసీ బస్సులో కండక్టర్ ఆత్మహత్య.. కారణం ఏంటంటే..
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనలో నిందితులకు 20యేళ్ల జైలుశిక్ష పడిన ఉదంతం నిరుడు డిసెంబర్ లో వెలుగు చూసింది. విశాఖపట్నం ఆరో అదనపు జిల్లా న్యాయస్థానం/మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి ఏం సువర్ణరాజు ఓ అత్యాచారం కేసులో 20యేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చారు. మైనర్ బాలికను మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డ సంఘటనలో ముగ్గురు నిందితులకు 20 ఏళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష విధించారు. దీంతో పాటు ముగ్గురూ మరో పదివేల చొప్పున జరిమానా కట్టాలని ఆదేశించారు. ఒకవేళ నిందితులు ఎవరైనా ఈ పదివేల జరిమానా కట్టలేకపోతే.. 20యేళ్ల జైలుశిక్షతో పాటు మరో నెల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఎం. శైలజ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. విశాఖపట్నం గాజువాక సమీపంలోని భానోజీతోట ప్రాంతానికి చెందిన మహ్మద్ అష్రాఫ్, మహ్మద్ అమీర్ అలమ్, పోటేలు రాంజీ అనే ముగ్గురు వ్యక్తులు స్నేహితులు. 2011 నవంబరు 28న ఓ 11 ఏళ్ల బాలిక మీద సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. చిన్నారి అదే ప్రాంతానికి చెందిన అమ్మాయి. అక్కడి దగ్గర్లోని గవర్నమెంట్ స్కూల్లో 5వ తరగతి చదువుకుంటోంది. ఆ రోజు తన సోదరికి జ్వరంగా ఉండడంతో ఆమెకోసం బ్రెడ్ తీసుకురావడానికి చిన్నారి ఒంటరిగా బయటకొచ్చింది.
అది గమనించిన ముగ్గురు నిందితులు... ఆ చిన్నారికి బిస్కెట్లు, డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. అక్కడినుంచి చిన్నారిని కాస్త దూరంగా తీసుకువెళ్లి.. ముగ్గురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన చిన్నారి ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి.. వారి నేరం రుజువు కావడంతో నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధించారు.