హైదరాబాద్ లో దారుణం: కేవలం సెల్ ఫోన్ కోసం... సొంత అన్నపైనే తమ్ముడు హత్యాయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Jan 27, 2022, 11:45 AM ISTUpdated : Jan 27, 2022, 11:49 AM IST
హైదరాబాద్ లో దారుణం: కేవలం సెల్ ఫోన్ కోసం... సొంత అన్నపైనే తమ్ముడు హత్యాయత్నం

సారాంశం

రక్త సంబంధాలన్నీ ఆర్థిక బంధాలేనని హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన మరోసారి రుజువు చేసింది. కేవలం సెల్ ఫోన్ కోసం సొంత అన్ననే అతి కిరాతకంగా చంపడానికి ప్రయత్నించాడో కసాయి తమ్ముడు. 

హైదరాబాద్: డబ్బుల వెనక పరుగెడుతూ మానవ సంబంధాలు ఎంత పలుచపడ్డాయో తెలియజేసే సంఘటన ఒకటి తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) మహానగరంలో వెలుగుచూసింది. కేవలం వేల రూపాయల విలువచేసే ఓ సెల్ ఫోన్ అన్నదమ్ముల మధ్య రక్తసంబంధాన్ని మరిచేలా చేసింది. మొబైల్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ పెరిగి పెద్దదై చివరకు అన్నను కడతేర్చడానికి కూడా తమ్ముడు సిద్దపడ్డాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ మదీన ప్రాంతంలోనే జమాల్ బండలో జావిద్(26), ఆసిఫ్(24) అనే అన్నదమ్ములు నివాసముండేవారు.వీరిద్దరూ నగరంలోని ఓ పంక్షన్ హాల్ లో పనిచేసేవారు. అయితే ఈ అన్నదమ్ముల మధ్య చిన్న విషయంలో గొడవ జరిగి ఒకరిని ఒకరు చంపుకునే స్థాయికి చేరింది. 

సెల్ ఫోన్ విషయంలో జావిద్, ఆసిఫ్ మధ్య గొడవ మొదలయ్యింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే అన్న జావిద్ పై కోపంతో రగిలిపోతున్న ఆసిఫ్ కత్తితో దాడికి తెగబడ్డాడు. అయితే వీరి గొడవ ముదిరి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరడంతో స్థానికులు కలుగచేసుకున్నారు. 

అయితే అప్పటికే తమ్ముడి చేతిలో కత్తిపోట్లకు గురయి తీవ్రంగా గాయపడిన జావిద్ ను స్థానికులు దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు ప్రస్తుతానికయితే ప్రాణాపాయం లేదని చెప్పినట్లు సమాచారం. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఫోన్ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ ప్రారంభమై చివరకు హత్యాయత్నానికి దారితీసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే ఆస్తి కోసం కన్నతల్లినే తాగుబోతు కొడుకు హత్యచేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అంతేకాదు తల్లిది సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. 

సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలం పోతులబొగుడ గ్రామానికి చెందిన మొండి మల్లమ్మ(55) కొడుకు మురళి వద్ద వుంటోంది. అయితే భర్త చనిపోవడంతో అతడి పేరున వున్న నాలుగు ఎకరాల భూమి మల్లమ్మ పేరిట వుంది. అలాగే ఆమె వద్ద బంగారు ఆభరాణాలు కూడా వున్నాయి. 

అయితే తల్లివద్ద వున్న భూమి, బంగారంపై తాగుబోతు కొడుకు కన్ను పడింది. భూమిని తన పేర రాయాలని, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వాలంటూ తాగివచ్చిన ప్రతిసారి తల్లితో గొడవకు దిగేవాడు మురళి. తన తదనంతరం ఆస్తులన్నీ నీకే దక్కుతాయని తల్లి చెప్పినా వినిపించుకోకుండా ఇప్పుడే వాటిని తనకు ఇవ్వాలని అడిగేవాడు. తాగుడుకు బానిసైన కొడుకు ఎక్కడ ఆస్తిని కరిగిస్తాడోనని ఆ తల్లి అతడికి అప్పగించేందుకు ససేమిరా అంది.  

దీంతో తల్లిపై కోపాన్ని పెంచుకున్న మురళికి దారుణానికి ఒడిగట్టాడు. తల్లి చనిపోతే ఎలాగూ ఆస్తి తనకే దక్కుతుందని భావించిన అతడు హత్యకు ప్లాన్ వేసాడు. ముందుగానే భార్యను పుట్టింటికి పంపించిన మురళి ఇంట్లో తల్లి ఒంటరిగా వున్న సమయంలో గొంతునులిమి చంపేసాడు. బుధవారం పట్టపగలే ఈ కిరాతకానికి పాల్పడ్డాడు.  

అనంతరం తన తల్లి అనారోగ్యంతో చనిపోయిందని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసాడు. అయితే  అతడిపై అనుమానంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి.. ఈ ప్రాంతాల్లో 3 రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City