కంచె శుభ్రం చేస్తుంటే తెగిపడిన సొరకాయ తీగ.. నిండు ప్రాణం బలి.. !

By SumaBala BukkaFirst Published Nov 9, 2022, 1:23 PM IST
Highlights

సొరకాయ తీగ విషయంలో చెలరేగిన వివాదం ఓ వ్యక్తి అనుమానాస్పద మృతికి కారణమయ్యింది. ఈ షాకింగ్ ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. 
 

ఖమ్మం : ఇరుగు, పొరుగు మధ్య గొడవలు మామూలే. సర్దుకుపోతే అంతా బాగుంటుంది. లేకపోతే అదే చిలికి చిలికి గాలివానలా మారి బద్దశత్రువుల్ని చేస్తుంది. ఇది చాలా గ్రామాల్లో కనిపించేదే. అయితే అలాంటి ఓ చిన్న వివాదం ఓ వ్యక్తి మృతికి కారణమయ్యింది. అయితే జరిగిందేంటో తెలియదు కానీ.. అతని మరణానికి పక్కింటిమహిళే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. 

సొరకాయ తీగ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన పెద్ద రగడ సృష్టిస్తోంది. వివరాల్లోకి వెడితే.. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో సొరకాయ తీగ కారణంగా ఒక ప్రాణం బలైపోయింది. గ్రామానికి చెందిన సూరయ్య తన ఇంటి ముందున్న కంచెను శుభ్రం చేస్తుండగా సొరకాయ తీగ తెగిపడింది. సూరయ్య ఇంటి పక్కనుండే మహిళ.. సొరకాయ తీగను ఎందుకు తెంపావంటూ ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సదరు మహిళ ఆవేశంలో సూరయ్యను కర్రతో కొట్టడంతో వివాదం కాస్తా చినికి చినికి గాలివానలా మారింది. 

సాయంత్రం గవర్నర్ తమిళిసై మీడియా సమావేశం.. ఏం చెబుతారనే దానిపై ఉత్కంఠ..

పెద్దమనుషులు సర్ది చెప్పడంతో అప్పటికి గొడవ సద్దుమణిగింది. అయితే, తెల్లారేసరికి సూరయ్య విగతజీవిగా మారడంతో గ్రామంలో కలకలం రేగింది. సూరయ్య చనిపోవడానికి కృష్ణవేణి కొట్టిన దెబ్బలే కారణం అంటూ ఆందోళనకు దిగారు బాధితుడుడి కుటుంబసభ్యులు. బంధువులు కృష్ణవేణి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు . సూరయ్యను కొట్టిన కృష్ణవేణి మీద సత్తుపల్లి పీఎస్ లో కంప్లైంట్ చేశారు. 

అయితే, తాను చిన్న కట్టెపెల్లతో కాళ్లపై మాత్రమే కొట్టానని కృష్ణవేణి అంటోంది. చాలా చిన్న దెబ్బ కొట్టానని, దానికి పెద్ద మనుషులు వెయ్యి రూపాయలు జరిమానా కూడా విధించారని చెబుతోంది. అతను అనారోగ్యంతో చనిపోతే, తనవల్లే మరణించాడని చెప్పడం దారుణమంటోంది కృష్ణవేణి. ఏది ఏమైనప్పటికీ.. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూరయ్య మృతి మిస్టరీ తేల్చేందుకు బాడీనీ పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

click me!