
గోదావరి నదిలో చేపలు పడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి దురదృష్టవశాత్తూ తాను కట్టిన వలకే చిక్కుకుని మరణించాడు. వివరాల్లోకి వెళితే.. బాసరకు చెందిన తొందూర్ నాగేశ్ నదిలో చేపలు పడుతూ జీవనం సాగిస్తుంటాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నదిలో నీటి ప్రవాహం విపరీతంగా పెరిగింది.
దీంతో చేపలు లభిస్తాయన్న ఆశతో శుక్రవారం నదిలో చేపల కోసం వలవేశాడు. అనంతరం తిరిగి శనివారం చేపల కోసం నాటుపడవపై వెళ్లి తాను వేసిన వలలోనే ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయాడు. నీటిలో మునిగిపోతున్న నాగేశ్‌ను ఒడ్డుపై ఉన్న తోటి జాలర్లు గమనించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వారు నాగేశ్ ఉన్న చోటికి చేరుకునేలోపే అతను నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
అయితే... తొందూర్ నాగేశ్ బాసర వాసులకు, ఆలయ అధికారులకు, గోదావరి నది వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి సుపరిచితుడే. బాసర ఆలయానికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ నీటమునగబోయే ఎంతో మంది భక్తులను నాగేశ్ కాపాడాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకోవాలని గోదావరి నదిలో దూకిన పలువురిని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చాడు. అలాంటి నాగేశ్ చివరికి తానే వేసిన చేపల వలలో చిక్కి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఫోన్‌లో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. మృతుడికి భార్యతోపాటు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.